IRGC : అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్ తన సైనిక వ్యూహంలో కీలక మార్పులు చేయనున్నట్లు సంకేతాలను అందించింది. ఇప్పటివరకు తమ చర్యలు రక్షణాత్మకంగానే ఉన్నాయని, అయితే భవిష్యత్తులో అవి ఆక్రమణ రూపం దాల్చవచ్చని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) సీనియర్ అధికారి స్పష్టం చేశారు. అలాగే శత్రువులు ఒక ‘వ్యూహాత్మక సర్‌ప్రైజ్’  కోసం సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) రాజకీయ బ్యూరో చీఫ్ బ్రిగెడియర్‌ జనరల్ యదోల్లా జావాని మాట్లాడుతూ, అమెరికా వైపు నుంచి గూఢచర్య లేదా భూభాగంలోకి చొరబడే ప్రయత్నాలు జరిగితే ఇరాన్ ప్రతిస్పందన కేవలం రక్షణకు మాత్రమే పరిమితం కాదని తీవ్రంగా హెచ్చిరించారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇటీవల హోర్మూజ్ జలసంధిని అమెరికా ప్రాంతంగా ప్రకటిస్తామని వ్యాఖ్యానించడం, ఆ తర్వాత వైట్ హౌస్ దానిని జోక్ అని కొట్టిపారేసినప్పటికీ ఇరాన్ దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. అమెరికా గనుక ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే, అమెరికా , దాని మిత్రదేశాల ఇంధన నెట్‌వర్క్‌లు, పవర్ ప్లాంట్లు కూడా తమ టార్గెట్‌లో ఉంటాయని IRGC ప్రతినిధి హోసేన్ మోహెబ్బీ గతంలోనే హెచ్చరించారు.

బహ్రెయిన్, కువైట్‌లోని అమెరిక స్థావరాలను టార్గెట్ చేసే అవకాశాలపై ఇరాన్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఖార్క్ ద్వీపం వంటి కీలక చమురు ఎగుమతి కేంద్రాల భద్రతను ఇరాన్ మరింత కట్టుదిట్టం చేసింది.తక్షణమే అమెరికాపై ఇరాన్ నేరుగా భూతల దాడి చేస్తుందని చెప్పలేనప్పటికీ, అమెరికా చేసే ఎలాంటి దూకుడు చర్యకైనా సరే కేవలం రక్షణాత్మక పద్ధతిలోనే కాకుండా, ఆక్రమణ రకమైన వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలను కూడా తెరపై ఉంచాలని టెహ్రాన్ భావిస్తున్నట్లు తాజా ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.