కోవిడ్ 19 నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది. ఈ సమయంలో మళ్లీ కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుని కొత్త వేరియంట్‌లో వస్తోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ భయంకరంగా ఉందని, విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా ఇప్పుడు PJ.2.1 కోవిడ్-19 కొత్త వేరియంట్ వచ్చింది. ఈ కొత్త వైరస్ కేవలం సాధారణ జలుబు, ఫ్లూ లాగే కనిపిస్తూనే ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అసలు ఈ కొత్త వేరియంట్ ఎందుకు అంత ప్రమాదకరంగా మారింది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎవరెవరు ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి? అనే వివరాలు తెలుసుకుందాం.

కోవిడ్ కొత్త వేరియంట్ PJ.2.1 తాజాగా అమెరికాలో వెలుగు చూసింది. ఈ కొత్త రకం వైరస్ సోకినప్పుడు వచ్చే లక్షణాలు సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలకు అచ్చం అలాగే ఉంటాయి. దీనివల్ల బాధితులు ఇది సాధారణ వైరల్ ఫ్లూ అనుకుని పొరపడే అవకాశం ఉంది. గొంతు నొప్పి, జలుబు, ముక్కు కారడం, విపరీతమైన అలసట వంటి సాధారణ సమస్యలే దీని ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి. అయితే పాత కోవిడ్ వేరియంట్లలో కనిపించే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఇందులో కనిపించడం లేదని.. అందువల్ల కేవలం లక్షణాలను బట్టి ఇది కోవిడా లేక సాధారణ ఫ్లూనా అని గుర్తించడం ఎవరికీ సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read : పాకిస్తాన్‌లో చైనా ప్రాజెక్ట్‌కు బిగ్ షాక్: కుప్పకూలిన కాఫర్‌డ్యామ్!

ఇది నిజంగానే ఒక Silent Threat అని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణ పరీక్షలు లేదా ప్రామాణిక కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఈ కొత్త PJ.2.1 వేరియంట్‌ను సరిగ్గా గుర్తించలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో SARS-CoV-2 సంక్రమణను సాధారణంగా PCR పరీక్షలు లేదా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు గుర్తిస్తాయి. కానీ ఈ కొత్త వేరియంట్ అత్యంత సూక్ష్మంగా మారిపోవడంతో దీని ఉనికిని కనిపెట్టడం కొంచెం కష్టంగా మారుతోంది. PJ.2.1 సోకిన వాళ్లలో తీవ్రమైన గొంతు నొప్పి ఉండటంతో పాటు కోలుకున్న తర్వాత కూడా దీర్ఘకాలిక అలసట వేధిస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రష్యన్ అంటువ్యాధుల నిపుణురాలు, వైరాలజిస్ట్ ఎలెనా మాలిన్నికోవా కూడా ఈ కొత్త వేరియంట్ లక్షణాల గురించి వివరిస్తూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కొత్త సైలెంట్ వేరియంట్ విషయంలో ముఖ్యంగా కొన్ని వర్గాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నవారు దీని బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ వైరస్ పట్ల ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. వయసు పైబడిన వాళ్లలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల చిన్న ఇన్ఫెక్షన్ కూడా తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే గుండె జబ్బులు, మధుమేహం, కిడ్నీ సమస్యలు లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న దీర్ఘకాలిక రోగులు శ్వాసకోశ సంబంధిత లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోవద్దు.

ప్రస్తుత శీతాకాల వాతావరణంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి రావడం సాధారణమే కదా అని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ సమయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా కొన్ని రోజుల పాటు గొంతు నొప్పి తగ్గకుండా ఉండటం, ముక్కు కారడం, విపరీతమైన నీరసం లేదా ఒళ్లు నొప్పులు వంటివి వేధిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : అమెరికా రాజకీయాల్లో సడన్ ట్విస్ట్.. ఓటమి తర్వాత ట్రంప్‌ వేసిన ఊహించని స్కెచ్!