donald Trump

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఐటీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ టెకీలకు ట్రంప్(Donald Trump) ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాదారులు శాశ్వత నివాసం పొందేందుకు అత్యంత కీలకమైన పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (PERM) నుంచి మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని, ఎడోబ్ వంటి 8 దిగ్గజ ఐటీ కంపెనీలను అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది గ్రీన్ కార్డ్ కలలకు ఆటంకం కలిగిందని నిపుణులు అంటున్నారు.

Also Read : డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. చర్చలు కాదని దాడులకు దిగితే ఇక యుద్ధమే!

అమెరికన్ల ఉద్యోగాలను విదేశీ ఉద్యోగులు ఎక్కువగా తీసుకుంటున్నారనే ఆరోపణలతోనే ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాలు, విదేశీ నియామకాల నిబంధనలను ఈ ఐటీ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, కార్మిక చట్టాలను ఉల్లంఘించి స్థానిక అమెరికన్లకు దక్కాల్సిన అవకాశాలను తక్కువ వేతనాలకే లభించే విదేశీ ఉద్యోగులకు కట్టబెడుతున్నారని అధికారులు ఆరోపించారు. ఈ 8 కంపెనీల నుంచి కొత్తగా పర్మ్ దరఖాస్తులను స్వీకరించబోమని.. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా నిలిపివేస్తున్నామని వైట్ హౌస్ ప్రకటించింది.

అయితే పర్మ్ ప్రోగ్రామ్ సస్పెన్షన్ కారణంగా ప్రభావిత కంపెనీలలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు గ్రీన్ కార్డ్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా శాశ్వత నివాసం కోసం PERM మార్గంపై ఆధారపడిన ఉద్యోగుల దరఖాస్తులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఈ నిలిపివేత కేవలం లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇది నేరుగా ప్రస్తుతం అమల్లో ఉన్న H-1B వీసాలను రద్దు చేయదు. H-1B అనేది తాత్కాలిక పని వీసా కాబట్టి, నిబంధనల ప్రకారం అర్హులైన విదేశీ నిపుణులు ఆరు సంవత్సరాల వరకు అమెరికాలో తమ ఉద్యోగాల్లో కొనసాగవచ్చు.

గ్రీన్ కార్డ్ పొందడానికి ఇబ్బందులు వారికి కలగడంతో వారు ఇంకా కొన్నేళ్లు తాత్కాలిక వీసాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీని తీవ్రత అనేది ఒక్కో ఉద్యోగి ఇమ్మిగ్రేషన్ స్థితి, వారి దరఖాస్తు ఏ దశలో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. అమెరికాలో శాశ్వత నివాసం పొందడానికి PERM ఒక్కటే మార్గం కాదు. అసాధారణ ప్రతిభ ఉన్న వారి కోసం EB-1A కేటగిరీ, EB-2 నేషనల్ ఇంటరెస్ట్ వేవర్ (NIW) వంటి స్వీయ-పిటిషన్ మార్గాలు, కొన్ని కుటుంబ-ఆధారిత వీసా దరఖాస్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నిషేధం వల్ల అమెరికాలోని ఐటీ కంపెనీలకు విదేశాల నుంచి కొత్త నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకోవడం, ఉన్న ఉద్యోగులను సంస్థలో నిలుపుకోవడం సవాలుగా మారనుంది.

Also Read : పాకిస్తాన్‌ను ముక్కలు చేయబోతున్న ఆర్మీ చీఫ్.. ఆసిమ్ మునీర్ స్కెచ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!