
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని ఒక ప్రధాన రహదారికి తన పేరు పెట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన ఒక అపూర్వమైన గౌరవం అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో రాసుకొచ్చారు. రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఒక ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా నిర్మించిన అమెరికా రాయబార కార్యాలయం పక్కనే ఉన్న రోడ్డుకు తెలంగాణ ప్రభుత్వం డోనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టింది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటీవల భారత్‌లో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ బోర్డును అధికారికంగా ప్రారంభించారు.
హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తీసుకురావడానికి, అమెరికాతో ఉన్న వ్యాపార, సాంకేతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే హైదరాబాద్‌లోని కొన్ని ప్రధాన రోడ్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తులు, సంస్థల పేర్లు పెడతామని ప్రకటించారు. అందులో భాగంగానే ట్రంప్ పేరును ఎంపిక చేశారు.
ట్రంప్ ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్ట్ పెట్టడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అయితే, దీనిపై స్థానికంగా రాజకీయ వివాదం కూడా మొదలైంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తెలంగాణ-అమెరికా మధ్య ఉన్న స్నేహానికి గుర్తు అని చెబుతుంటే.. ప్రతిపక్ష బీజేపీ మాత్రం కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తోందంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఏదేమైనా, అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్‌లో ఇలా ఒక రోడ్డుకు పేరు పెట్టడం ఇదే మొదటిసారి కావడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.









