Donald Trump
Donald Trump

Donald Trump :  అమెరికా కంపెనీలపై డిజిటల్ సర్వీస్ టాక్స్ విధించే ఏ దేశానికైనా గట్టి షాక్ ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అలాంటి దేశాల నుంచి అమెరికాకు వచ్చే అన్ని రకాల వస్తువులపై 100 శాతం పన్ను విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ఆయా దేశాలతో ఇదివరకు చేసుకున్న వ్యాపార ఒప్పందాలను కూడా రద్దు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. అమెరికాకు చెందిన ఆల్ఫాబెట్ (గూగుల్), మెటా (ఫేస్‌బుక్) వంటి పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలను టార్గెట్ చేస్తూ కొన్ని దేశాలు ఇలాంటి పన్నులు వేస్తున్నాయని, ఇది ఎంతమాత్రం సరికాదని ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

అయితే, ట్రంప్ ఇచ్చిన ఈ హెచ్చరిక వల్ల ఇండియాకు ఎలాంటి నష్టం లేదా ప్రభావం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే, విదేశీ టెక్నాలజీ కంపెనీలపై భారత్ ఇదివరకు విధించిన ఈక్వలైజేషన్ లెవీ (దీనినే సాధారణంగా గూగుల్ టాక్స్ అని పిలుస్తారు) అనే పన్నును మన ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా ఎత్తేసింది. ఇండియాలో ఆఫీసు లేకపోయినా, ఇక్కడి వ్యాపారాల ద్వారా ప్రకటనల రూపంలో డబ్బులు సంపాదించే విదేశీ కంపెనీలపై 2016లో మన దేశం 6 శాతం పన్నును ప్రవేశపెట్టింది. కానీ, అమెరికాతో వ్యాపార సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో, 2025 ఫైనాన్స్ బిల్లు ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ డిజిటల్ ప్రకటనల పన్నును భారత ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అలాగే, ఈ-కామర్స్ కంపెనీలపై ఉన్న 2 శాతం పన్నును కూడా 2024లోనే తీసేసింది. కాబట్టి మన దేశానికి ఇప్పుడు ఎలాంటి ముప్పు లేదు.

Also Read : వోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులు ఔట్!

అమెరికా కంపెనీలపై పన్నులు వేస్తే

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలకే పెద్ద కష్టం వచ్చి పడనుంది. అమెరికాతో కుదుర్చుకున్న పాత ఒప్పందం ప్రకారం యూరప్ వస్తువులపై కేవలం 15 శాతం లోపే పన్నులు ఉండాలి. కానీ, ఈ డిజిటల్ సేవల పన్ను విషయంలో అమెరికాకు, యూరప్ దేశాలకు అస్సలు పడటం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలన్నీ అమెరికాలోనే ఉన్నందున, ఇలాంటి పన్నులు తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ కోపంగా ఉన్నారు. అందుకే, ఫ్రాన్స్ దేశం గనక తమ డిజిటల్ పన్నును వెనక్కి తీసుకోకపోతే, అక్కడి నుంచి వచ్చే వైన్, షాంపెయిన్లపై 100 శాతం పన్ను వేస్తానని ఈ మధ్యే ఆయన హెచ్చరించారు. ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రియా, స్పెయిన్ వంటి దేశాలు అమెరికా కంపెనీలపై పన్నులు వేస్తే ఊరుకునేది లేదని అమెరికా ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా హెచ్చరికపై యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ.. తమ హక్కులను కాపాడుకోవడానికి తాము కూడా అంతే వేగంగా, గట్టిగా సమాధానం ఇస్తామని ప్రకటించింది.

Also Read : పాకిస్తాన్‌లో భారీ భూకంపం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.