
Turkish Airlines :ట్యునీషియాకు వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రయాణీకులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. తీవ్ర కుదుపులకు గురి కావడంతో ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కేకలు పెట్టారు. విమానం ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుదుపులకు గురికావడం, విమానం కింద పడిపోతున్నట్లు అనిపించడంతో ప్రయాణికులు భయంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు. చివరకు విమానాన్ని మరో ఎయిర్‌పోర్టుకు మళ్లించి సురక్షితంగా కిందకి దించడంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఇస్తాంబుల్ నుంచి ట్యునీషియా రాజధాని టునిస్‌కు బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం TK 661లో చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం సృష్టించింది.
దీనికి సంబంధించిన వీడియోను మైస్కాయా అనే ప్రయాణికురాలు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్తాంబుల్ నుంచి బయలుదేరిన తర్వాత విమాన ప్రయాణం సాఫిగానే సాగింది. అయితే టునిస్-కార్తేజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగేందుకు ప్రయత్నించినప్పటి నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని తెలిపింది. పైలట్ ల్యాండింగ్‌కు మూడు సార్లు ప్రయత్నించినట్లు ఆమె వివరించారు. ల్యాండింగ్‌కు ప్రయత్నించిన ప్రతిసారీ విమానం తుపాను ప్రాంతం మీదుగా వెళ్లడంతో తీవ్ర కుదుపులకు గురైందని వెల్లడించారు. ‘మూడోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా కిందకు పడిపోతున్నట్లుగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు. నా జీవితంలో ప్రాణాల కోసం నేను ఎప్పుడూ అలా భయపడలేదు. ఆ సమయంలో నాతో పాటు అమ్మ కూడా ఉంది’ అని మైస్కాయా తప పోస్టులో వివరించారు..
పైలట్ నాలుగోసారి కూడా అక్కడే ల్యాండింగ్‌కు ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని మైస్కాయా వివరించారు. దీంతో వారంతా ‘మరో దేశానికి వెళ్లండి.. వేరే విమానాశ్రయంలో దించండి’ అంటూ ప్రయాణికులు పెద్ద ఎత్తున కేకలు వేసినట్లు చెప్పారు. దీంతో పైలట్‌చివరకు విమానాన్ని టునిస్-కార్తేజ్ విమానాశ్రయానికి సుమారు 60 మైళ్ల దూరంలో ఉన్న ఎన్‌ఫిధా-హమ్మమెట్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు మళ్లించారని ఆమె వివరించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని పేర్కొన్నారు. ‘మేమంతా సురక్షితంగా బయటపడ్డాం. బహుశా టర్కిష్ ఎయిర్‌లైన్స్ పైలట్ల నైపుణ్యం వల్లే ఇది సాధ్యమైంది’ అని మైస్కాయా ఆనందం వ్యక్తం చేశారు. కాగా, టునిస్-కార్తేజ్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నించిన సమయంలో ప్రతికూల వాతావరణం నెలకొంది. తీవ్ర గాలులు, టర్బులెన్స్ కారణంగా విమానం భారీగా కుదుపులకు గురైనట్లు సిబ్బంది వివరించారు.









