Pakistan : టర్కీకి చెందిన యుద్ధ విమానాలు వరుసగా పాకిస్తాన్ చుట్టూ చక్కర్లు కొడుతుండటం కలకలం రేపింది. ఆ విమనాలు పాకిస్తాన్ కు వస్తూ.. తిరిగి అక్కడి నుంచి వెళ్తూ.. ప్రయాణం సాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మూడు రోజులుగా ఈ వ్యవహారం సాగుతోందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆగష్టు 19, 20, 21 తేదీల్లో టర్కీ యుద్ధ విమానాలు అనేకం పాకిస్తాన్ వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. అవి కూడా వరుసగా వస్తూ, పోతూ ఉండటాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి. ముఖ్యంగా టర్కీకి చెందిన సీ-130 హెర్క్యులెస్ అనే రవాణా విమానాలు ఎక్కువసార్లు ఇరు దేశాల మధ్య సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కాగా, టర్కీకి చెందిన ఈ యుద్ధ విమానాలు సరుకుల్ని రవాణా చేయగలవు. గడిచిన 60 గంటల్లో ఇవి పలుమార్లు టర్కీ నుంచి పాక్.. అక్కడి నుంచి టర్కీ ప్రయాణించినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఉన్నట్లుండి ఇలా టర్కీ విమానాలు పాక్ ఎందుకు వెళ్తున్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి పాక్ గానీ, అటు టర్కీ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టర్కీ నుంచి పాకిస్తాన్‌లోని‌, రావల్పిండిలో ఉన్న నుర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు, కరాచీలోని మస్రూర్ ఎయిర్‌బేస్‌కు యుద్ధ విమానాలు రాకపోకలు సాగించినట్లు వెల్లడైంది. గతంలో ఎపుడు ఇలా జరిగి ఉండకపోవడంతో ఇది అసాధారణమైన ప్రక్రియగా నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆయుధాల నిల్వలను పెంచుకుంటోందనే వార్తలు వినవస్తు్న్నాయి.

అందుకే ప్రస్తుతం పాకిస్థాన్‌ డ్రోన్ల (మానవ రహిత యుద్ధ విమానాలు)ను భారీగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే టర్కీ నుంచి భారీగా డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (వైమానిక దాడి రక్షణ వ్యవస్థ)ను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కొనుగోలు చేసిన డ్రోన్లను యుద్ధ విమానాల ద్వారా టర్కీ.. పాకిస్తాన్‌కు సరఫరా చేసినట్లు నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రకారం టర్కీ భారీ స్థాయిలో పాకిస్తాన్‌కు డ్రోన్లు అందించినట్లు అంచనాకు వచ్చాయి. డ్రోన్లతోపాటు అత్యున్నత క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా టర్కీ పాక్‌కు అందించినట్లు తెలుస్తోంది. వీటిలో బేరక్టార్ టీబీ2 చాలా కీలకమైంది. ఇది టర్కీ అభివృద్ధి చేసిన మిడ్ రేంజ్ డ్రోన్. దీన్ని టర్కీ.. గతంలో ఉక్రెయిన్‌కు కూడా అందించినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లను ఉక్రెయిన్.. రష్యాపై దాడి చేసేందుకు వాడుతోంది.

కాగా, టర్కీ దగ్గర ఉన్న వాటిలో ఈ డ్రోన్‌ అత్యంత ప్రభావవంతమైన డ్రోన్‌గా చెప్తారు. ఇటీవల టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య సైనిక, రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ నాటోగా పిలిచే ఈ కూటమిలో యుద్ధ సమయంలో ఒక దేశానికి మరో దేశం సహకరించుకోవాలనేది వీటి మధ్య ఒప్పందం. దీనిలో భాగంగానే ఈ డ్రోన్లను పాకిస్తాన్‌కు టర్కీ సరఫరా చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.