భవిష్యత్తులో అంతరిక్షంలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా, రష్యాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. భవిష్యత్ చంద్ర స్థావరాలకు కావలసిన ఇంధనాన్ని అందించడానికి వనరులను సేకరించడానికి చంద్రుడిపై అణు రియాక్టర్లను నిర్మించడమే ఏకైక మార్గమని ఈ దేశాలు భావిస్తున్నాయి. శాశ్వత మానవ స్థావరాలను ఏర్పాటు చేసే క్రమంలో ప్రారంభమైన ఈ పోటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని, భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తిస్తోంది.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రునిపై అణు రియాక్టర్‌ను నిర్మించడానికి శరవేగంగా అడుగులు వేస్తోంది. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఎలాంటి మానవ నిర్వహణ లేకుండా చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో పనిచేయగల అణు రియాక్టర్‌ను సిద్ధం చేయమని నాసా గత ఆగస్టులోనే ప్రైవేట్ కాంట్రాక్టర్లను కోరింది. 2030 డిసెంబర్ నాటికి ఈ రియాక్టర్‌ను ప్రయోగానికి సిద్ధం చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లూనార్ రియాక్టర్ 1 నుండి 20 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ, ఐదేళ్ల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు చైనాతో తనకున్న భాగస్వామ్యంలో భాగంగా రష్యా కూడా ఒక భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోంది. చైనా నేతృత్వంలో నిర్మించే చంద్ర కేంద్రాలకు విద్యుత్‌ను అందించడానికి రష్యా 2036 నాటికి సెలెనా అనే చంద్ర రియాక్టర్‌ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ సెలెనా రియాక్టర్ 10 కిలోవాట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేస్త, ఎలాంటి మానవ జోక్యం లేకుండా ఒక దశాబ్దం పాటు స్వయంప్రతిపత్తితో పనిచేసేలా రూపొందిస్తోంది.

చంద్రునిపై శాశ్వత స్థావరాన్ని నడపడానికి నిరంతర విద్యుత్ అవసరం. సౌర ఫలకాలు పగటిపూట విద్యుత్‌ను అందించగలవు.. కానీ భూమి క్యాలెండర్ ప్రకారం చంద్రుడిపై రాత్రులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉంటాయి. ఈ చీకటి, గడ్డకట్టే చలిలో కేవలం సౌరశక్తిపై ఆధారపడటం సాధ్యం కాదు. సూర్యరశ్మితో సంబంధం లేకుండా సుదీర్ఘ కాలం పాటు విద్యుత్‌ను సరఫరా చేయగల సామర్థ్యం కేవలం అణు రియాక్టర్లకు మాత్రమే ఉంటుంది. ప్రారంభ దశలో చిన్న అవసరాలకు సౌరశక్తిని వాడినా, పెద్ద స్థావరాలకు అణుశక్తే ఉన్న ఒకే ఒక్క ఆప్షన్.

చంద్రుడిపై రియాక్టర్లను నిర్మించే క్రమంలో ఎదురయ్యే ప్రమాదాలపై శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగ సమయంలో రాకెట్ విఫలమైతే అందులోని రేడియోధార్మిక పదార్థాలు వ్యాపించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా భూమిపై ఉన్నట్లుగా చంద్రుడిపై రియాక్టర్ల చుట్టూ కాంక్రీట్ రక్షణ నిర్మాణాలు చేపట్టడం దాదాపు అసాధ్యం. దీనివల్ల అక్కడి వ్యోమగాములకు, పరికరాలకు రేడియేషన్ ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ ప్రమాదాలను తగ్గించడానికి అమెరికా, రష్యాలు తమ రియాక్టర్లను నిష్క్రియ స్థితిలోనే చంద్రుడిపైకి పంపాలని భావిస్తున్నాయి.

ఈ పోటీ కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా చంద్రుడి వనరులపై ఆధిపత్యం సాధించే దిశగా సాగుతోంది. 1967 నాటి బాహ్య అంతరిక్ష ఒప్పందం ప్రకారం ఏ దేశమూ చంద్రుడిని తమ స్వంత భూభాగంగా ప్రకటించుకోకూడదు. కానీ చైనా, రష్యాలు తమ అణు రియాక్టర్ల భద్రత పేరుతో నియంత్రిత మండలాలను ఏర్పాటు చేస్తే అమెరికన్ రోవర్లు లేదా వ్యోమగాములు ప్రయాణించే ప్రాంతాలు పరిమితమైపోతాయని నాసా భయపడుతోంది.