US War: భూమిమీద వివిధ దేశాలతో యుద్ధాలు చేస్తున్న అమెరికా, నేల సరిపోదన్నట్లు అంతరిక్షంలోనూ యుద్ధానికి సిద్దమైందా? అంటే అవుననే అంటున్నాయి US స్పేస్ ఫోర్స్ వర్గాలు. ఇప్పటికే అమెరికా అంతరిక్షంలో ఆయుధాలను మోహరించినట్లు US స్పేస్ ఫోర్స్ వెల్లడించింది. భూమిపై యుద్ధం వచ్చినప్పుడు ఇతర దేశాల శాటిలైట్లను ధ్వంసం చేయడానికి ఈ ఆయుధాలు ఉపయోగపడతాయి. పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ ఆయుధాలతో భవిష్యత్తులో భూమిపై కూడా దాడులు జరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. భూమి యొక్క కక్ష్య (ఆర్బిట్)లో ఆయుధాలను మోహరించే సామర్థ్యం తమకు ఉందని అమెరికా అంగీకరించడం ఇదే తొలిసారి. “ఎదురుదాడికి దిగే శత్రువుల చర్యల నుండి జాయింట్ ఫోర్స్‌ను రక్షించగల స్పేస్ కంట్రోల్ ఆయుధాలు అమెరికా వద్ద ఆర్బిట్‌లో అందుబాటులో ఉన్నాయి” అని యూఎస్ స్పేస్ ఫోర్స్ ప్రతినిధి ఒకరు AFP వార్తా సంస్థకు తెలిపిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే అంతరిక్షంలో ఏ విధమైన ఆయుధాలను మోహరించారనే నిర్దిష్ట సమాచారాన్ని మాత్రం ఆ ప్రకటనలో వెల్లడించకపోవడం గమనార్హం.

అమెరికన్ స్పేస్ ఫోర్స్ ఏమి చెప్పింది?
“స్పేస్ డొమైన్‌లో ఆధిపత్యం చెలాయించడానికి ,దానిని నియంత్రించడానికి అవసరమైన మిషన్లు స్పేస్ కంట్రోల్‌లో భాగం. ఇందులో శత్రువుల సామర్థ్యాలను దెబ్బతీయడానికి కైనెటిక్,నాన్-కైనెటిక్ పద్ధతులను ఉపయోగిస్తారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ సామర్థ్యాలను దాడి,రక్షణ రెండింటికీ ఉపయోగించవచ్చని తెలిపారు. ప్రస్తుత కాలంలో అమెరికాకు రష్యా, చైనాలు ప్రధాన ప్రత్యర్థులు. అంతరిక్షంలో ఈ రెండు దేశాలు అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఆ దేశం భావిస్తోంది. యూఎస్ స్పేస్ ఫోర్స్ ప్రకారం.. చైనా తన సైనిక ఆధునీకరణ వ్యూహంలో భాగంగా స్పేస్ , కౌంటర్-స్పేస్ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, రష్యా అంతరిక్షాన్ని ఒక యుద్ధరంగంగా భావిస్తూ, భవిష్యత్తు పోరాటాలలో అంతరిక్షంలో ఆధిపత్యమే నిర్ణయాత్మకమైన అంశంగా ఉంటుందని విశ్వసిస్తోంది.

యుద్ధరంగంగా మారిన అంతరిక్షం
నిజానికి అంతరిక్ష సైనికత అనేది అంతరిక్ష స్పర్ధ ఎంత పాతదో అంతే పాతది. 1957లో రష్యా స్పుత్నిక్‌ను ఆర్బిట్‌లోకి ప్రయోగించిన వెంటనే, వాషింగ్టన్ ,మాస్కోలు ఉపగ్రహాలను ఆయుధీకరించడం, వాటిని నాశనం చేసే మార్గాలపై పనిచేయడం ప్రారంభించాయి. ఒకానొక సమయంలో అంతరిక్షంలో అణు ఆయుధాల గురించిన ఆందోళన ఎక్కువగా ఉండేది. కానీ 1967లో ప్రపంచ అగ్రరాజ్యాలు,ఇతర దేశాలు ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ (Outer Space Treaty) అనే ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది ఆర్బిట్‌లో విధ్వంసకర ఆయుధాల ప్రయోగాన్ని నిషేధించినట్లయింది.

అయితే అప్పటి నుండి రష్యా, అమెరికా, చైనాలు ఆ ఒప్పంద పరిధికి వెలుపల ఉంటూ అంతరిక్షంలో పోరాడే మార్గాలపై అన్వేషిస్తూనే ఉన్నాయి. ఇందులో ప్రత్యర్థి దేశాల శాటిలైట్లను లక్ష్యంగా చేసుకోవడం ఒక భాగంగా ఉంది. ఈ ఉపగ్రహాలు సైనిక కమ్యూనికేషన్, నిఘా, నేవిగేషన్ కు సంబంధించి అత్యంత కీలకమైనవి. ఒకవేళ యుద్ధం గనక వస్తే శత్రు దేశపు శాటిలైట్‌ను ధ్వంసం చేయడం ద్వారా ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చన్నది ప్రత్యర్థి దేశాల లక్ష్యంగా ఉంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.