Donald Trump : అమెరికాలో పెట్టుబడులు పెట్టి గ్రీన్ కార్డు పొందాలనుకునే వారికి భారీ షాక్ తగిలింది. EB-5 ఇన్వెస్టర్ వీసా ఫీజులను అమెరికా ప్రభుత్వం భారీగా పెంచింది. కొన్ని ఫీజులు ఏకంగా రెండింతలకుపైగా పెరగనున్నాయి. దీంతో అమెరికాలో పెట్టుబడులు పెట్టి శాశ్వత నివాసం పొందాలని చూస్తున్న భారతీయులపై కూడా ప్రభావం పడనుంది. కొత్త ఫీజులు నవంబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కొత్త ఫీజుల వివరాలను ప్రకటించింది. అమెరికాలో నేరుగా పెట్టుబడి పెట్టే వారు దాఖలు చేసే Form I-526 ఫీజు ప్రస్తుతం 3,675 డాలర్లు ఉండగా.. ఇకపై 7,615 డాలర్లు చెల్లించాలి.

EB-5 ద్వారా అమెరికాలో గ్రీన్ కార్డు పొందిన తర్వాత దానిపై ఉన్న షరతులను తొలగించుకునేందుకు పెట్టే Form I-829 ఫీజు కూడా పెరగనుంది. ప్రస్తుతం 3,750 డాలర్లు ఉన్న ఈ ఫీజు ఇకపై 5,000 డాలర్లు కానుంది. రీజినల్ సెంటర్లకు సంబంధించిన ఫీజులు మాత్రం భారీగా పెరగనున్నాయి. రీజినల్ సెంటర్‌గా గుర్తింపు పొందేందుకు చెల్లించే Form I-956 ఫీజు 17,795 డాలర్ల నుంచి ఏకంగా 44,115 డాలర్లకు పెరగనుంది. పెట్టుబడి ప్రాజెక్టుకు అనుమతి కోసం చెల్లించే Form I-956F ఫీజు 42,675 డాలర్లకు చేరనుంది.

Also Read : దుబాయ్ విమానంలో హైజాక్ సంకేతాలు.. రంగంలోకి దిగిన ఫైటర్‌ జెట్లు

అయితే రీజినల్ సెంటర్లు ప్రతి ఏడాది చెల్లించే Form I-956G ఫీజు మాత్రం తగ్గనుంది. ప్రస్తుతం 3,035 డాలర్లు ఉన్న ఈ ఫీజు ఇకపై 2,165 డాలర్లకు తగ్గుతుంది. పాత EB-5 దరఖాస్తుల్లో కొన్ని మార్పులు చేసుకునేందుకు Form I-527 అనే కొత్త ఫారమ్‌ను కూడా USCIS తీసుకొచ్చింది. దీనికి 10,330 డాలర్లు ఫీజుగా నిర్ణయించింది. ఫీజులు పెంచడానికి కారణం EB-5 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అయ్యే ఖర్చులను ఈ ఫీజుల ద్వారానే భరించడమేనని USCIS తెలిపింది. పెట్టుబడిదారుల పత్రాలను పరిశీలించడం, వారి వివరాలను తనిఖీ చేయడం, మోసాలను గుర్తించడం, ప్రాజెక్టులను తనిఖీ చేయడం వంటి పనులకు ఈ డబ్బును ఉపయోగించనున్నట్లు చెప్పింది.

2022లో వచ్చిన EB-5 Reform and Integrity Act ప్రకారం.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అయ్యే మొత్తం ఖర్చుకు సరిపడేలా ఫీజులను నిర్ణయించాలని USCISను ఆదేశించారు. రీజినల్ సెంటర్లు, పెట్టుబడి ప్రాజెక్టులు, వాటి ప్రమోటర్లపై తనిఖీలను కూడా పెంచారు. రీజినల్ సెంటర్లు చెల్లించే EB-5 Integrity Fund ఫీజు కూడా పెరగనుంది. 20 మంది లేదా అంతకంటే తక్కువ పెట్టుబడిదారులు ఉన్న రీజినల్ సెంటర్లు ఏడాదికి 10,000 డాలర్లకు బదులుగా 11,000 డాలర్లు చెల్లించాలి. 20 మందికి పైగా పెట్టుబడిదారులు ఉన్న రీజినల్ సెంటర్లకు ఈ ఫీజు 20,000 డాలర్ల నుంచి 22,000 డాలర్లకు పెరగనుంది.

ఈ ఫీజులను సమయానికి చెల్లించకపోతే జరిమానాలు కూడా ఉంటాయి. నవంబర్‌లో ఆలస్యంగా చెల్లిస్తే 10 శాతం, డిసెంబర్‌లో చెల్లిస్తే 20 శాతం వరకు జరిమానా పడొచ్చు. ఫీజు చెల్లించడంలో పదేపదే ఆలస్యం చేస్తే రీజినల్ సెంటర్ అనుమతిని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. అమెరికా ప్రభుత్వం 1990లో EB-5 కార్యక్రమాన్ని ప్రారంభించింది. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు అమెరికాలో ఉద్యోగాలు పెంచడం దీని ప్రధాన లక్ష్యం. అర్హత ఉన్న వారు అమెరికాలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి, అవసరమైన ఉద్యోగాలను కల్పిస్తే తమతో పాటు భార్య లేదా భర్త, అర్హత ఉన్న పిల్లలకు కూడా గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం EB-5 కింద కొన్ని ప్రాంతాల్లో 8 లక్షల డాలర్లు, ఇతర ప్రాంతాల్లో 10.5 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలి. దీనికి అదనంగా ప్రభుత్వ ఫీజులు, లాయర్ ఖర్చులు, ఇతర ఖర్చులు ఉంటాయి. కొత్త ఫీజుల పెంపుతో అమెరికాలో EB-5 ద్వారా గ్రీన్ కార్డు పొందాలనుకునే భారతీయులకు మొత్తం ఖర్చు మరింత పెరగనుంది.

Also Read : ట్రంప్ సంచలన ప్రకటన.. AI పేరు మార్చేసిన అమెరికా ప్రెసిడెంట్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.