
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులతో పాటు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్వేర్, ఇతర రంగాల నిపుణులకు ఆ దేశ ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ కాబోతుంది. విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు కీలకమైన హెచ్-1బీ వీసాలు, ఎఫ్-1 ఓపీటీ ప్రోగ్రామ్‌లపై కొత్తగా భారీ ఫీజులను విధించేందుకు యుఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం నిబంధనలను సవరించే చర్యలను వేగవంతం చేసింది. ఈ కొత్త ఫీజుల ప్రతిపాదనకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను ప్రస్తుతం వైట్‌హౌస్ రెగ్యులేటరీ విభాగం సమీక్షిస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే రాబోయే రోజుల్లో దరఖాస్తుదారులపై ఆర్థికంగా పడే భారం ఊహించని స్థాయిలో ఉండనుంది.
అమెరికాలోని యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునేందుకు ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ ఓపీటీ దరఖాస్తులకు సంబంధించి ప్రతిపాదిత కొత్త నిబంధనలలో భాగంగా కొన్ని ప్రత్యేక కేటగిరీల కింద ఏకంగా లక్ష డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలో రూ.83 లక్షలకు పైగా వరకు భారీ ఫీజును ప్రవేశపెట్టే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే భారతీయ విద్యార్థులకు అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పొందడం తీవ్ర సవాలుగా మారనుంది.
హెచ్-1బీ వీసాలు, ఎఫ్-1 ఓపీటీ సదుపాయాన్ని పొందుతున్న వారిలో సింహభాగం భారతీయ విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్సే ఉన్నారు. ఇప్పటికే అమెరికా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు, వీసా ప్రాసెసింగ్ నిబంధనల కఠినతరం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న భారతీయులకు ఈ కొత్త ఫీజుల బాంబు బిగ్ షాక్ ఇచ్చింది.
ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి లక్షలాది రూపాయల రుణాలు తీసుకుని అమెరికా వెళ్లే విద్యార్థుల భవిష్యత్తుపై ఈ ప్రతిపాదనలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయి. ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న ‘అమెరికా ఫస్ట్’ విధానాల్లో భాగంగానే విదేశీ నిపుణులు, విద్యార్థులపై ఈ ఆంక్షలు విధిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.









