
US Green Card : అమెరికాలో గ్రీన్ కార్డ్ దరఖాస్తులను చెక్ చేసే పబ్లిక్ ఛార్జ్ నియమాల్లో ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలు సెప్టెంబర్ 18 నుంచి అమలులోకి వస్తాయి. ఆ తేదీ నుంచి కొత్త దరఖాస్తు ఫారమ్‌ను (Form I-485) మాత్రమే వాడాలి, పాత ఫారమ్‌లను అంగీకరించరు. ఈ కొత్త నియమాల ప్రకారం, అమెరికా వచ్చే వారు ప్రభుత్వం ఇచ్చే ఉచిత సాయంపై ఆధారపడకుండా సొంతంగా బతకగలరో లేదో అధికారులు మరింత కఠినంగా తనిఖీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి వయస్సు, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితి, ఆస్తులు, సంపాదన, చదువు పనిచేసే నైపుణ్యాలను బట్టి ఈ నిర్ణయం తీసుకుంటారు.
హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ జూలై 20న ప్రచురించిన ఆదేశాల ప్రకారం 2022 నాటి పాత నియమాలను రద్దు చేశారు. అమెరికా చట్టాల ప్రకారం, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు లేదా సంక్షేమ పథకాలపైనే పూర్తిగా ఆధారపడే వారికి వీసా లేదా గ్రీన్ కార్డ్ ఇవ్వరు. వలస వచ్చిన వారు ప్రజల పన్నుల డబ్బుతో నడిచే ప్రభుత్వ సాయంపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనేదే దీని ముఖ్య ఉద్దేశం.
ఈ మార్పుల్లో ముఖ్యమైనది ఏంటంటే.. సెప్టెంబర్ 18 కంటే ముందు ప్రభుత్వం నుంచి తీసుకున్న సాయానికి పాత నియమాలే వర్తిస్తాయి. అప్పట్లో కేవలం ప్రభుత్వం నుంచి నేరుగా తీసుకున్న నగదు సాయం లేదా దీర్ఘకాలిక వైద్య సంరక్షణను మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. కానీ సెప్టెంబర్ 18 తర్వాత ప్రభుత్వం నుంచి తీసుకునే ఉచిత ఇళ్లు, ఫుడ్ స్టాంప్స్, చదువు కోసం తీసుకునే ఆర్థిక సాయం వంటి అన్ని రకాల ఉచిత పథకాలను అధికారులు లెక్కలోకి తీసుకుంటారు. అయితే ఉద్యోగం లేకపోవడం, ఎక్కువ వయస్సు ఉండటం లేదా వికలాంగులు అయినంత మాత్రాన ఎవరినీ నేరుగా అనర్హులుగా చేయరు. ప్రతి ఒక్కరి పరిస్థితిని విడివిడిగా చూసి నిర్ణయం తీసుకుంటారు. పనిచేసే ఓపిక, ఆరోగ్యం ఉన్నవారిని ఈ ఒక్క కారణంతో ఆపరని చెప్పారు.
ఒకవేళ ఒక దరఖాస్తుదారుడికి ప్రభుత్వంపై ఆధారపడతారనే ఒక్క అనుమానం తప్ప మిగతా అన్ని అర్హతలు ఉంటే, అధికారులు వారికి పబ్లిక్ ఛార్జ్ బాండ్ కట్టే అవకాశం ఇవ్వవచ్చు. అయితే ఈ అవకాశం ఇవ్వడం అనేది పూర్తిగా అధికారుల చేతుల్లోనే ఉంటుంది. సెప్టెంబర్ 18 తర్వాత ఈ బాండ్ కట్టిన తర్వాత కూడా సదరు వ్యక్తి ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సాయం పొందితే, వారు కట్టిన బాండ్ సొమ్మును ప్రభుత్వం జమ చేసుకుంటుంది.
ఈ కొత్త నియమాలు అమెరికా పౌరుల భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారందరికీ వర్తిస్తాయి. అయితే శరణార్థులు, అమెరికాలో ఆశ్రయం పొందిన వారు, గ్రీన్ కార్డ్ రెన్యూవల్ చేసుకునేవారు, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసేవారు. గృహ హింస బాధితులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఉంటుంది.









