రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య తక్షణమే ఇంధన వనరులపై దాడులను నిలిపివేసే ఎనర్జీ సీజ్‌ఫైర్ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించారు. విద్యుత్ కేంద్రాలు, చమురు సంస్థలు, గ్యాస్ పైప్‌లైన్ల వంటి కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పరం ఎలాంటి దాడులు చేయకూడదని ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపారు. ఈ ఒప్పందాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని ఇరుపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.

Also Read : ఇక ప్రపంచం అంతం.. 2100 నాటికి మనుషులు ఉండరు.. లాన్సెట్ నివేదికలో షాకింగ్ విషయాలు!

ఈ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ స్పందిస్తూ.. ట్రంప్ ప్రతిపాదించిన ఇంధన కాల్పుల విరమణపై తాము చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్ ఈ ఒప్పందానికి పూర్తిగా మద్దతు ఇస్తుందని, అయితే దీనికి రష్యా కూడా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తమ దేశానికి చెందిన విద్యుత్, ఇంధన కేంద్రాలపై రష్యా దాడులను పూర్తిగా నిలిపివేస్తే తాము కూడా రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలపై జరిపే దాడులను ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ విషయమై అమెరికా నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఎక్స్ వేదికగా వివరించారు. కాగా ట్రంప్ చేసిన ఈ ఉమ్మడి ప్రకటనపై రష్యా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

మరోవైపు రష్యా డీజిల్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి స్వంత రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు బ్రియాన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ ప్రత్యేక బిల్లును చట్టసభలో తీసుకువస్తానని అతను ప్రకటించారు. ఆయన ప్రతిపాదనకు మరొక రిపబ్లికన్ సభ్యుడు డాన్ బెకాన్ కూడా మద్దతు తెలిపారు. అయితే ప్రస్తుత ప్రతినిధుల సభ పదవీకాలం త్వరలోనే ముగియనుండటంతో ఈ బిల్లు ఆమోదం పొందడానికి తగిన సమయం లభించకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

Also Read : రష్యా-ఉక్రెయిన్ సీజ్‌ఫైర్‌పై బిగ్ సస్పెన్స్.. ట్రంప్‌కి షాకిచ్చిన జెలెన్‌స్కీ