
మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్ర తీర ప్రాంతాల్లో తాము స్వాధీనం చేసుకున్న బిలియన్ల డాలర్ల విలువైన అమెరికా, ఇజ్రాయెల్ వాణిజ్య నౌకలను, వాటిలోని సరుకును బహిరంగ మార్కెట్లో వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఇకపై ఆ నౌకలను తమ ఓడరేవుల్లో ఉంచి సమయాన్ని వృథా చేయబోమని, చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి వేలం వేస్తామని ఇరాన్ న్యాయశాఖ ఉన్నతాధికారి హసన్ అబ్దులియన్పూర్ స్పష్టం చేశారు.
అయితే ఈ వేలంలో ఈ నౌకలు, సరుకుల అమ్మకం ద్వారా వచ్చే భారీ రాబడిని ఇరాన్ తమ ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం లేదు. అమెరికా సైనిక దాడులు, ఆంక్షల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ పౌరుల కుటుంబాలకు, తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఈ సొమ్మును నష్టపరిహారంగా అందజేయాలని భావిస్తోంది. అమెరికా ఆంక్షల వల్ల తమ దేశానికి జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు ఈ వేలం ధనాన్ని ఒక రకమైన పరిహారం అని ఇరాన్ తెలిపింది.
Also Read : బాలయ్య మాస్ వీడియోతో ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్.. మేం రెడీ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇరాన్ ఎంబసీ!
గత కొన్నేళ్లుగా పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే విదేశీ చమురు ట్యాంకర్లను ఇరాన్ స్వాధీనం చేసుకుంటూ వస్తోంది. తమ చమురు నౌకలను అమెరికా అడ్డుకుంటే, తాము కూడా అమెరికా, దాని మిత్రదేశాల నౌకలను అడ్డుకుని ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ వాదిస్తోంది. భద్రతా నిబంధనల ఉల్లంఘన, సముద్ర కాలుష్యం వంటి కారణాలు చూపుతూ వీటిని స్వాధీనం చేసుకుంటుంది. అయితే ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రంలో ఆ దేశ కంపెనీల నౌకలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది.
ఇరాన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఇరాన్ చర్యలను చట్టవిరుద్ధమని, సముద్రపు దొంగతనం అని వారు ఆరోపిస్తున్నారు. ఈ వేలం ప్రకటనతో పర్షియన్ గల్ఫ్‌లో తమ యుద్ధనౌకల గస్తీని పెంచడానికి అమెరికా రక్షణ శాఖ సిద్ధమవుతోంది. దీనివల్ల ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరిగే ప్రమాదం ముప్పుగా పరిణమించే అవకాశముంది.
మరోవైపు ఇరాన్ వేలం నిర్ణయం ప్రపంచ వాణిజ్యం, చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పర్షియన్ గల్ఫ్‌లో నౌకల స్వాధీనం, వేలం వార్తలతో సముద్ర రవాణా బీమా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతాయి. ప్రపంచ ముడి చమురులో మూడింట ఒక వంతు ప్రయాణించే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే, అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకవచ్చు.
Also Read : హౌతీలు సంచలన ప్రకటన.. ఆనందంలో ట్రంప్..?









