అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న తీవ్ర స్థాయి సైనిక, ఆర్థిక పోరు ఇప్పుడు అగ్రరాజ్య అగ్రనేతల ప్రాణాల మీదికి తెచ్చింది. ఇరాన్ నుంచి నేరుగా ప్రాణభయం, తీవ్ర భద్రతా ముప్పు పొంచి ఉందన్న అత్యున్నత సమాచారంతో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తన అధికారిక నివాసాన్ని అత్యవసరంగా ఖాళీ చేశారు. అమెరికా భద్రతా విభాగాలు అతన్ని ఒక అత్యంత సురక్షితమైన సైనిక స్థావరానికి రహస్యంగా తరలించి రక్షణ కల్పిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఇరాన్ శత్రుత్వానికి, టార్గెట్ హిట్‌లిస్ట్‌లో బెస్సెంట్ పేరు మొదటి స్థానంలో ఉండటానికి ప్రధాన కారణం ఆయన అమలు చేస్తున్న పక్కా ఆర్థిక వ్యూహాలే. అమెరికా ప్రభుత్వం ఇరాన్‌ను ఆర్థికంగా పూర్తిగా మూలమూలలా దెబ్బతీసేందుకు పన్నుతున్న కుట్రలకు స్కాట్ బెస్సెంట్ ప్రధాన సారథిగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ ప్రధాన ఆర్థిక వనరు అయిన చమురు ఎగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఇరాన్ తన సైనిక దళాలకు, క్షిపణి వ్యవస్థలకు విదేశాల నుంచి నిధులు సమకూర్చుకోకుండా అంతర్జాతీయ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ల నుంచి పూర్తిగా వేరుచేశారు. మూడో దేశాల ద్వారా ఇరాన్‌కు ఆర్థిక సాయం అందకుండా కఠిన ఆంక్షలను అమలు చేయడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా బెస్సెంట్ రచించిన వ్యూహాలే ఆయనను ఇరాన్ దృష్టిలో నంబర్ వన్ శత్రువుగా మార్చాయి.

Also Read : వందేళ్ల తర్వాత స్వదేశానికి చేరిన నాగా పూర్వీకుల అవశేషాలు

ఈ తీవ్ర ఆర్థిక దెబ్బల కారణంగానే ఇరాన్ ఆయనపై విపరీతమైన కక్ష పెంచుకుందని.. అందుకే నేరుగా ఆయన్నే లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్రలు పన్నుతోందని అమెరికా నిఘా వర్గాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఉమ్మడిగా ఇరాన్‌లోని వ్యూహాత్మక స్థావరాలు, సైనిక కేంద్రాలపై విరుచుకుపడటంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది. ఈ దాడుల సమయంలో ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్రశ్రేణి ఇరాన్ సైనిక నాయకులు ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. అమెరికా గడ్డపైనే ఉన్న అగ్ర అధికారులను, పౌరులను టార్గెట్ చేసి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ రహస్య ప్రణాళికలు రచిస్తోందన్న అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి.

తన సొంత భూభాగంలో అమెరికన్లను లేదా కీలక అధికారులను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుందనే ఆరోపణలను ఆ దేశం అధికారికంగా ఖండిస్తున్నప్పటికీ, అమెరికా ప్రభుత్వం మాత్రం దీనిని అస్సలు తేలికగా తీసుకోవడం లేదు. అమెరికా గడ్డపైనే తమ మంత్రి స్థాయి వ్యక్తికి ఈ స్థాయిలో ప్రాణహాని ముప్పు రావడం అగ్రరాజ్యాన్ని తీవ్ర భద్రతా సవాలులోకి నెట్టింది. బెస్సెంట్‌కు అందిన బెదిరింపుల తీవ్రత ఎంతవరకు ఉందనేది అధికారికంగా బయటకు రానప్పటికీ.. ఒక క్యాబినెట్ స్థాయి మంత్రిని సడన్‌గా మిలిటరీ బేస్‌లోని బంకర్లోకి తరలించారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామం అమెరికా-ఇరాన్ మధ్య శత్రుత్వాన్ని మరింత పరాకాష్టకు తీసుకెళ్లింది. ఆర్థిక ముట్టడితో ఇరాన్‌ను కోలుకోలేకుండా చేయాలని అమెరికా చూస్తుంటే.. దానికి ప్రతిగా అమెరికా కీలక నేతలనే భయకంపితులను చేసేలా ఇరాన్ తన వ్యూహాలను మారుస్తోంది.

Also Read : వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. బ్లూ టిక్స్ పడకుండానే మెసేజ్ చదవచ్చు.. ఎలాగంటే?