
Video Viral : లండన్ నుంచి ఢాకాకు వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు కొట్టుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానంలో జరిగిన ఈ గొడవతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమానంలో ఉన్న ఇద్దరు పురుష ప్రయాణికుల మధ్య మొదట మాటలతో గొడవ మొదలైనట్లు వీడియోలో కనిపిస్తోంది. కొద్దిసేపటికే వారి మధ్య వాగ్వాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటూ కొట్టుకున్నారు.
Also Read : హద్దులు దాటుతోన్న ఏఐ… మనమనుకున్నంత మంచిది కాదండోయ్
గొడవ తీవ్రతరం కావడంతో ఓ ప్రయాణికుడి టీషర్ట్ కూడా చినిగిపోయింది. ఇద్దరూ కొట్టుకుంటుండటంతో విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధ ప్రయాణికులు ఈ ఘటనతో భయపడ్డారు. ఇద్దరు ప్రయాణికులు కొట్టుకుంటున్న సమయంలో విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులు వెంటనే స్పందించారు. వారిని విడదీసేందుకు ప్రయత్నించారు. కొంతసేపు విమానంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ గొడవ విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలోనే జరిగినట్లు సమాచారం. తోటి ప్రయాణికుల ముందే ఇద్దరి మధ్య ఈ కొట్లాట జరిగినట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) మహబూబుద్దీన్ అహ్మద్‌ను ఢాకా ట్రిబ్యూన్ సంప్రదించింది. అయితే ఈ ఘటన గురించి తనకు ఇంకా సమాచారం లేదని ఆయన తెలిపారు. ఈ విషయం గురించి నాకు ఇంకా తెలియదు. వివరాలు తెలుసుకుంటున్నాను అని మహబూబుద్దీన్ అహ్మద్ చెప్పారు.
Also Read : ఇరాన్ లో అమెరికా మారణకాండ.. ఐరాస మానవహక్కుల సంస్థ సంచలన ఆరోపణ









