
UK : ఒకప్పుడు ప్రపంచంలోని చాలా ప్రాంతాలను పాలించిన బ్రిటన్‌కు ఇప్పుడు తన దేశాన్ని ఒకటిగా ఉంచుకోవడమే కష్టంగా మారుతోందా? యునైటెడ్ కింగ్‌డమ్ భవిష్యత్తుపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. UK నుంచి విడిపోవాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. ఈ డిమాండ్ నెరవేరితే యునైటెడ్ కింగ్‌డమ్ మ్యాప్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం UKలో ఉన్న స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్.. ఈ మూడు ప్రాంతాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు కావాలని కోరుతున్నాయి. వీటిలో స్కాట్లాండ్, వేల్స్ UK నుంచి స్వతంత్ర దేశాలుగా మారాలని కోరుకుంటుండగా.. ఉత్తర ఐర్లాండ్ మాత్రం ఐర్లాండ్‌లో కలవాలని కోరుకుంటోంది.
స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఫస్ట్ మినిస్టర్లు కార్డిఫ్‌లో ఒక డిక్లరేషన్‌పై సంతకం చేసే అవకాశం ఉంది. UKలో కొనసాగాలా లేక విడిపోవాలా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయించుకునే హక్కు తమకు ఉండాలని వారు ఈ డిక్లరేషన్ ద్వారా కోరనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణ.. అంటే రెఫరెండంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఈ మూడు ప్రాంతాలు కోరుతున్నాయి.
స్కాట్లాండ్ UK నుంచి విడిపోవాలనే అంశంపై బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ చర్చ మరింత వేడెక్కింది. స్కాట్లాండ్ ప్రజల్లో UK నుంచి విడిపోవాలనే అభిప్రాయానికి మెజారిటీ మద్దతు వస్తే రెఫరెండానికి అనుమతి ఇవ్వొచ్చని ఆయన సూచించినట్లు సమాచారం. దీంతో స్కాటిష్ నేషనల్ పార్టీ ఈ అంశాన్ని ప్రధాన రాజకీయ అంశంగా తీసుకుంది. ఆ పార్టీ నాయకుడు, స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ.. ఆండీ బర్న్‌హామ్ UKకు చివరి ప్రధానమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్.. ఈ మూడు ప్రాంతాల నాయకత్వం ప్రస్తుతం స్వాతంత్ర్యానికి అనుకూలంగా ఉన్న వారి చేతుల్లోనే ఉందని స్విన్నీ అన్నారు. UK విడిపోయిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉండాలనే దానిపై బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మూడు రోజుల క్రితం తాను యునైటెడ్ ఐర్లాండ్ ను చూడాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో UK భవిష్యత్తుపై చర్చ మరింత ఆసక్తికరంగా మారింది.
చాలా మంది UK, బ్రిటన్, గ్రేట్ బ్రిటన్, ఇంగ్లండ్‌ను ఒకటిగానే భావిస్తారు. కానీ వీటి మధ్య తేడా ఉంది. సుమారు 500 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ ప్రధాన ప్రాంతంగా ఉండేది. అదే సమయంలో వేల్స్‌పై ఇంగ్లండ్ ఆధిపత్యం క్రమంగా పెరిగింది. చివరకు 1536లో చట్టం ద్వారా వేల్స్‌ను ఇంగ్లండ్‌లో కలిపారు. ఆ తర్వాత 1603లో స్కాట్లాండ్ రాజు ఇంగ్లండ్ రాజుగా కూడా మారారు. అనంతరం 1707లో ఇంగ్లండ్, స్కాట్లాండ్ పార్లమెంట్లు యాక్ట్ ఆఫ్ యూనియన్ 1707ను ఆమోదించాయి. దీంతో కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. ఆ తర్వాత 1801లో ఐర్లాండ్, గ్రేట్ బ్రిటన్ ఒకటయ్యాయి. అయితే 1922లో ఐర్లాండ్‌లోని కొంత భాగం విడిపోయి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ గా ఏర్పడింది. మిగిలిన ఉత్తర ఐర్లాండ్ మాత్రం UKలోనే కొనసాగింది. ప్రస్తుతం UKలో నాలుగు దేశాలు ఉన్నాయి. అవి ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్. UK అధికారిక పేరు యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తర్న్ ఐర్లాండ్.
స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ UK నుంచి విడిపోతే అది ప్రపంచ రాజకీయాల్లోనే ఒక పెద్ద పరిణామంగా మారుతుంది. ఈ మూడు ప్రాంతాలు విడిపోతే UK భూభాగం, జనాభా, ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు వస్తాయి. చివరికి UKలో ఇంగ్లండ్ మాత్రమే మిగిలే పరిస్థితి ఏర్పడుతుంది. భూమి పరంగా చూస్తే.. ఈ మూడు ప్రాంతాలు విడిపోతే UKలోని 46.3 శాతం భూభాగం తగ్గిపోతుంది. ప్రస్తుతం UK మొత్తం విస్తీర్ణం సుమారు 2,42,500 చదరపు కిలోమీటర్లు. ఇందులో విడిపోవాలని కోరుకుంటున్న స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల విస్తీర్ణం కలిపి సుమారు 1,12,220 చదరపు కిలోమీటర్లు. జనాభా పరంగా చూస్తే.. UK జనాభాలో దాదాపు 16 శాతం తగ్గిపోతుంది. ప్రస్తుతం UK జనాభా సుమారు 6.8 కోట్లు. ఇందులో ఇంగ్లండ్ జనాభా సుమారు 5.7 కోట్లు కాగా.. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లో కలిపి సుమారు 1.1 కోట్ల మంది ఉన్నారు. ఆర్థికంగా కూడా ప్రభావం ఉంటుంది. ఈ మూడు ప్రాంతాలు విడిపోతే UK GDP దాదాపు 14 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రకారం ప్రస్తుతం UK GDP సుమారు 4.26 ట్రిలియన్ డాలర్లు. ఇందులో ఇంగ్లండ్ వాటా దాదాపు 86 శాతం.
UK నుంచి ఈ మూడు ప్రాంతాలు విడిపోతే కేవలం భూమి, జనాభా, GDP మాత్రమే తగ్గిపోవు. ఇంకా చాలా కీలకమైన విషయాల్లో బ్రిటన్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా స్కాట్లాండ్ విషయానికి వస్తే.. మొత్తం UK భూభాగంలో దాదాపు 32 శాతం స్కాట్లాండ్‌లోనే ఉంది. అంతేకాదు UKకు చెందిన సముద్ర ప్రాంతాల్లో 60 శాతానికి పైగా స్కాట్లాండ్ తీర ప్రాంతం చుట్టూ ఉన్నాయి. స్కాట్లాండ్ విడిపోతే ఉత్తర సముద్రంలోని భారీ సముద్ర ప్రాంతం ఇంగ్లండ్ నియంత్రణలో ఉండకపోవచ్చు. అంతేకాదు UKలో ఉన్న చమురు, సహజ వాయువు నిల్వల్లో దాదాపు 85 నుంచి 90 శాతం వరకు స్కాట్లాండ్ సముద్ర సరిహద్దుల్లోనే ఉన్నట్లు సమాచారం. స్కాట్లాండ్ విడిపోతే ఇంగ్లండ్ తన అవసరాలకు విద్యుత్, గ్యాస్‌ను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.
మరో కీలకమైన అంశం బ్రిటన్ అణ్వాయుధ కార్యక్రమం. UKకు చెందిన మొత్తం అణ్వాయుధ వ్యవస్థ స్కాట్లాండ్‌లోని ఫాస్లేన్ నేవల్ బేస్‌లో ఉంది. స్కాట్లాండ్ UK నుంచి విడిపోతే ఈ అణ్వాయుధ స్థావరాన్ని ఇంగ్లండ్‌కు తరలించడం పెద్ద సమస్యగా మారుతుంది. ఇంగ్లండ్ తీర ప్రాంతాల్లో ఇలాంటి అణ్వాయుధ స్థావరాన్ని వెంటనే ఏర్పాటు చేసే స్థలం ప్రస్తుతం లేదని చెబుతున్నారు. కొత్త స్థావరాన్ని నిర్మించి అణ్వాయుధ వ్యవస్థను అక్కడికి తరలించాలంటే భారీగా ఖర్చు అవుతుంది. దీనికి బిలియన్ల పౌండ్లు అవసరమవడంతో పాటు సుమారు 15 నుంచి 20 ఏళ్ల సమయం కూడా పట్టే అవకాశం ఉందని అంచనా. మొత్తంగా చూస్తే.. UK నుంచి స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ విడిపోతే బ్రిటన్ భూమి, జనాభా, ఆర్థిక వ్యవస్థ పరంగా భారీగా నష్టపోవాల్సి రావచ్చు. అంతేకాదు ప్రపంచంలో ఒకప్పుడు మహాశక్తిగా ఉన్న బ్రిటన్‌కు ఉన్న రాజకీయ, సైనిక ప్రభావం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. UK నిజంగా విడిపోతే.. బ్రిటన్ మ్యాప్ మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాల్లో దాని స్థానం కూడా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.









