Zimbabwe :  జింబాబ్వేలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఆరుగురితో వెళ్తున్న హెలికాప్టర్ గ్రామీణ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. మృతుల్లో ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, ఆయన భార్య లూసీ ముటేకే కూడా ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. హరారేకు ఆగ్నేయంగా ఉన్న మారోండెరా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది కలిపి మొత్తం ఆరుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Also Read : గుర్తు పెట్టుకోండి : ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకునే పేరు ఇది… ట్రంప్ నుంచి మోదీ వరకు భారత పైలట్ కు సలామ్!

ఈ ప్రమాదంపై నిక్ మంగ్వానా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హెలికాప్టర్‌లో ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఉన్నారని తెలిపారు. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడ్డట్లు ప్రస్తుత సమాచారం లేదని చెప్పారు. అయితే ప్రమాదంలో మరణించిన వారి పేర్లను అధికారులు వెంటనే వెల్లడించలేదు. పోలీసు ప్రతినిధి పాల్ న్యాతి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో మంటలు చెలరేగడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా ఉందని తెలిపారు. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, ఘటనా స్థలంలో సహాయక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. మరిన్ని వివరాలను తరువాత వెల్లడిస్తామని తెలిపారు. 43 ఏళ్ల చివాయో జింబాబ్వేలో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.

జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మెర్సన్ మ్నాంగగ్వాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆయన ప్రాంతీయ దేశాల నాయకులతో కలిసి ఉన్న ఫొటోలు, సమావేశాలకు సంబంధించిన పోస్టులను తరచూ పంచుకునేవారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, కెన్యా అధ్యక్షుడు విలియం రూటో, టాంజానియా అధ్యక్షురాలు సామియా సులుహు హసన్, ఎస్వాతిని రాజు మస్వాతి మూడోతో ఆయన సమావేశమైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన వ్యాపార వ్యవహారాలు, రాజకీయ సంబంధాలపై గతంలో విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. జింబాబ్వేతో పాటు పొరుగు దేశాల్లో ప్రభుత్వ కాంట్రాక్టులు, ఎన్నికల నిధులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ ఆరోపణలను చివాయో ఖండించారు.

Also Read : ఇరాక్‌కు గుడ్ బై చెప్పేసిన అమెరికా.. 23 ఏళ్ల బిగ్ డ్రామాకి ఎండ్ కార్డ్.. వెనకున్న మాస్టర్ ప్లాన్ ఇదే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.