Nepal : నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా తీవ్ర ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లింది. చైనాలోని టిబెట్ వైపు నుంచి భోటేకోషి నదిలో ఒక్కసారిగా పోటెత్తిన భారీ వరదలకు నేపాల్‌లోని నువాకోట్, ధాడింగ్, రసువా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. నువాకోట్, ధాడింగ్ జిల్లాల నుంచి ఇప్పటివరకు కనీసం ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.

Also Read : పాక్ సంచలన నిర్ణయం.. నకిలీ నోట్లకు చెక్!

నేపాల్ టూరిజం బోర్డు అందించిన సమాచారం ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 384 మంది టూరిస్టులు ఆచూకీ లేకుండా పోయారు. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ జాతీయస్థాయి పౌరులు ఉన్నారు. విదేశీ టూరిస్టులలో ఏకంగా 105 మంది భారతీయ పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రసువా జిల్లాలో సహాయక చర్యల్లో ఉన్న 26 మంది నేపాల్ పోలీసులు, 7 మంది సాయుధ పోలీసు సిబ్బంది కూడా గల్లంతయ్యారు.

వరద ఉధృతి ప్రమాదకరంగా మారడంతో నేపాల్ సైన్యం హెలికాప్టర్లను, డిజాస్టర్ రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించింది. నదుల పక్కన నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. ఈ విపత్తుపై నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా నేషనలిస్ట్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.

వైద్య బృందాలు, స్కౌట్స్, రెడ్ క్రాస్ సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని తెలిపారు. సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే రుతుపవనాల వర్షాలు ఈ ప్రాంతంలో వరదలకు కారణమవుతుంటాయని, వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి తీవ్రమైన విపత్తులు ఎక్కువవుతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తున్నారు.

Also Read : ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.