indian middle class debt
indian middle class debt

ఒకప్పుడు కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందంటే.. బ్యాంకులో ఎంత డబ్బుంది? ఎంత పొదుపు ఉంది? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? అని చూసేవాళ్లం. కానీ ఇప్పుడు మరో లెక్క కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబంపై ఎంత అప్పు ఉంది అని. ఎందుకంటే భారతీయ కుటుంబాలు పొదుపు చేయడం ఆపలేదు. డబ్బు దాచుకుంటూనే ఉన్నారు. పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. కానీ వారి అప్పులు మాత్రం పొదుపుతో పాటు వేగంగా పెరిగిపోతున్నాయి. నాలుగేళ్ల క్రితం భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న ప్రతి రూ.100 ఆర్థిక పొదుపుకు దాదాపు రూ.27 అప్పు కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడు అదే అప్పు రూ.32కి చేరింది. అంటే కుటుంబాల ఆర్థిక భద్రతలో అప్పు వాటా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అసలు విషయం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన తాజా గణాంకాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. మార్చి 2026 నాటికి భారతీయ కుటుంబాల వద్ద ఉన్న మొత్తం ఆర్థిక ఆస్తుల విలువ రూ.490.3 లక్షల కోట్లు. ఇది దేశ GDPలో దాదాపు 141.6 శాతం. అదే సమయంలో కుటుంబాల మొత్తం ఆర్థిక అప్పులు.. అంటే రుణాలు, అప్పులు కలిపి రూ.158.5 లక్షల కోట్లు.. ఇది GDPలో 45.8 శాతం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆర్థిక ఆస్తులు మాత్రమే. ఇళ్ల విలువ, భూములు, బంగారం వంటి భౌతిక ఆస్తులు ఇందులో లెక్కలోకి రావు. కాబట్టి కుటుంబాల మొత్తం సంపద దీనికంటే ఎక్కువే ఉండొచ్చు.

అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆస్తులు తగ్గిపోవడం కాదు.. ఆస్తుల కంటే అప్పులే వేగంగా పెరగడం. జూన్ 2022 నుంచి మార్చి 2026 వరకు 16 త్రైమాసికాలను తీసుకుంటే.. భారతీయ కుటుంబాల రుణాలు ఏకంగా 78 శాతం పెరిగాయి. ఇదే సమయంలో వారి ఫైనాన్షియల్ సేవింగ్స్ కేవలం 49 శాతం మాత్రమే పెరిగాయి. అంటే దేశ ఆదాయం కంటే కుటుంబాల అప్పులే ఎక్కువగా పెరిగాయి.

ఇక్కడ మరో కీలక విషయం ఉంది. భారతీయులు పొదుపు చేయడం మానేశారని RBI చెప్పడం లేదు. కుటుంబాల దగ్గరున్న ఆర్థిక ఆస్తుల విలువ పెరగడంతో పాటు.. అప్పులు కూడా వేగంగా పెరిగాయని చెబుతోంది. ఉదాహరణకు.. ఒక కుటుంబాన్ని ఊహించండి. నాలుగేళ్ల క్రితం బ్యాంకులో డబ్బు ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి విలువ మరింత పెరిగింది. కానీ అదే సమయంలో ఇంటి లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఇతర అప్పులు కూడా పెరిగాయి. అందుకే సంపద పెరిగినా ఆర్థిక ఒత్తిడి కూడా పెరిగింది.

Also Read : జైల్లో 5 నెలలు, ఎవరిదీ మూల్యం? వివాదంలో CEC కూతురు

ఇక కుటుంబాలు తమ డబ్బును ఎక్కడ పెడుతున్నాయన్న విషయంలో కూడా పెద్ద మార్పు కనిపిస్తోంది. మార్చి 2026 నాటికి కుటుంబాల ఆర్థిక ఆస్తులలో బ్యాంక్ డిపాజిట్స్ 34.4 శాతం వాటాతో అతిపెద్ద భాగంగా ఉన్నాయి. అయితే జూన్ 2022లో ఇది 36 శాతం. అంటే బ్యాంకు డిపాజిట్ల వాటా కొంత తగ్గింది.

అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ వాటా 6.4 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగింది. డైరెక్ట్ ఈక్విటీ అంటే నేరుగా షేర్స్‌లో పెట్టుబడుల వాటా మాత్రం 20.1 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింది. షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ రెండింటినీ కలిపి చూస్తే.. కుటుంబాల ఫైనాన్సియల్ సేవింగ్స్‌లో ప్రతి రూ.100లో దాదాపు రూ.29 మార్కెట్‌తో అనుసంధానమైన పెట్టుబడుల్లో ఉన్నాయి. అంటే కుటుంబాల సంపదలో మార్కెట్ ఆధారిత భాగం కూడా పెరిగింది. మార్కెట్ పెరిగితే సంపద పెరుగుతుంది. మార్కెట్ పడిపోతే ఆ సంపద విలువ తగ్గుతుంది.

Also Read : నా దవడ ఎముకలు విరిగాయి.. విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ రిప్లై!

అయితే ఇప్పుడు అసలు ప్రశ్న.. మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు అప్పుల్లోకి వెళ్తున్నాయి?.. దీనికి ఒక్క కారణం లేదు. హౌసింగ్ నుంచి ఎడ్యుకేషన్ వరకు.. వెహికల్ నుంచి హెల్త్ కేర్ వరకు.. పిల్లల చదువుల నుంచి లైఫ్‌స్టైల్ ఎక్స్‌పెన్సెస్ వరకు కుటుంబాల ఖర్చులు పెరుగుతున్నాయి. అదే సమయంలో సులభమైన రుణం అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే బ్యాంకులో లోన్స్ కోసం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్‌లో కొన్ని క్లిక్స్‌తో పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్, Buy Now Pay Later, కన్స్యూమర్ ఫైనాన్స్ లాంటి మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

అంటే ఆదాయం రావడానికి ముందే ఖర్చు చేయడం చేసే అవకాశం పెరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబాన్ని తీసుకుంటే.. వారి నెల జీతం రూ.60 వేలు అనుకుందాం. ఇంటి EMI రూ.20 వేలు, కార్ EMI రూ.10 వేలు, పర్సనల్ లోన్ EMI రూ.7 వేలు, క్రెడిట్ కార్డ్ బిల్ మరో రూ.5 వేలు, పిల్లల స్కూల్ ఫీజు, రెంట్ లేదా ఇతర ఖర్చులు కలిపితే జీతం చేతికి రాకముందే పెద్ద భాగం ఫిక్సిడ్ కమిట్‌మెంట్స్‌కే వెళ్లిపోతుంది. ఇక్కడ అసలు ప్రమాదం ఒక లోన్ తీసుకోవడంలో లేదు. ఒక అప్పును తీర్చడానికి మరో అప్పు తీసుకోవడం మొదలైనప్పుడే సమస్య తీవ్రమవుతుంది. ఉదాహరణకు క్రెడిట్ కార్డ్ బిల్ మొత్తం చెల్లించలేకపోతే బాకీ ఉన్న మొత్తంపై వడ్డీ పడుతుంది. దాన్ని పర్సనల్ లోన్‌తో క్లియర్ చేస్తారు. ఆ పర్సనల్ లోన్ EMI పెరుగుతుంది. మరోవైపు ఇంటి ఖర్చులు పెరిగితే క్రెడిట్ కార్డు మళ్లీ ఉపయోగిస్తారు. ఇలా అప్పుల చక్రం మొదలవుతుంది.

ఇక RBI గణాంకాలను చూస్తే పర్సనల్ లోన్స్ కూడా భారీ స్థాయిలో పెరిగాయి. మార్చి 2022లో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన చెల్లించవలసిన పర్సనల్ లోన్స్ దాదాపు రూ.34.7 లక్షల కోట్లు ఉండగా.. మార్చి 2026 నాటికి అది దాదాపు రూ.69.4 లక్షల కోట్లకు చేరింది. హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఇతర పర్సనల్ లోన్స్.. ఇవన్నీ ఇందులో కీలక భాగాలుగా ఉన్నాయి.

అయితే ఇక్కడ ఒక బ్యాలెన్స్ కూడా అర్థం చేసుకోవాలి. RBI చెప్పేది భారతీయ కుటుంబాలన్నీ ప్రమాదకర స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయాయని కాదు. 2026 ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం భారత కుటుంబ అప్పులు GDPతో పోలిస్తే.. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉంది. అంటే భారత్‌లో కుటుంబాల అప్పులు పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయంగా చూస్తే పరిస్థితి ఇంకా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరలేదు.

కానీ RBI డేటా చూపిస్తున్న ట్రెండ్ మాత్రం ఇక్కడ కీలకమైనది. పొదుపు పెరుగుతోంది.. కానీ అప్పు ఇంకా వేగంగా పెరుగుతోంది. అంటే ఈరోజు ఒక కుటుంబం ఆర్థికంగా సౌకర్యవంతమైన స్థితిలో కనిపించినా.. దాని ఆదాయంలో ఎంత భాగం ఇప్పటికే EMIలకే కేటాయిస్తున్నారో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇదే మధ్యతరగతి కుటుంబానికి అసలు సమస్య.

జీతం పెరిగింది. కానీ ఇంటి ధర కూడా పెరిగింది.
కొత్త ఇల్లు కావాలి.. లోన్.
కొత్త కారు కావాలి.. లోన్.
పిల్లల ఎడ్యుకేషన్.. లోన్.
అత్యవసర ఖర్చు.. క్రెడిట్ కార్డ్.
వినోదం, గాడ్జెట్స్, ట్రావెలింగ్.. EMI.

ఇలా అన్ని తీసుకోవడం, కొనుక్కోవడం చేస్తే ఆదాయం పెరుగుతున్నట్లే కనిపిస్తుంది. దీంతో పాటు అప్పులు కూడా పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో సేవింగ్స్ 49 శాతం పెరిగితే.. అప్పులు 78 శాతం పెరిగాయి. ఇదే ఈ స్టోరీలో అసలు హెచ్చరిక సంకేతం. ఎందుకంటే ఒక కుటుంబానికి సంపద ఎంత ఉందన్నదే కాదు… ఆ సంపదలో ఎంత భాగం నిజంగా వారి సొంతం? ఎంత భాగం అప్పుల్లో ఉంది? ప్రతి నెల ఆదాయంలో ఎంత భాగం EMIలకు వెళ్తోంది? ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎన్ని నెలలు అప్పు లేకుండా కుటుంబం నెట్టుకురాగలదు? ఇవే అసలు ఫైనాన్సియల్ హెల్త్‌ను నిర్ణయించే ప్రశ్నలు.

కాబట్టి RBI గణాంకాల అసలు సందేసం ఒక్కటే..“భారతీయ కుటుంబాలు సేవ్ చేస్తున్నాయి.. ఇన్వెస్ట్ చేస్తున్నాయి.. కానీ అప్పులు చేస్తున్న వేగం ఇంకా ఎక్కువగా ఉంది.” ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. అనేక కుటుంబాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటాయి. అందుకే అప్పుల భారం నుంచి తప్పుకోవాలంటే అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటమే మంచిది.