
Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ మధ్యకాలంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ ఐదు రోజుల వ్యవధిలోనే కురిసే వర్షాల వల్ల సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తర్వాత అంటే సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Also Read : ఏపీలో తీవ్ర విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత!
ఇప్పటికే రాష్ట్రంలో వర్షాల ప్రభావం మొదలైంది. శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో 7.4 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో 6.7 సెం.మీ., రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 6 సెం.మీ., యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో 4.9 సెం.మీ., వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో 3.4 సెం.మీ.ల చొప్పున వర్షం కురిసింది.
ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలోని కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే వీలుంది. అల్పపీడన తీవ్రత కారణంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావచ్చని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
Also Read : కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి… ధరలు పెరడగానికి అసలు కారణం ఏంటంటే?









