Crime News : హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో యువతి అనుమానాస్పదరీతిలో మృతిచెందింది. సిద్దిఖీ నగర్‌లోని రోడ్‌ నంబర్‌-5లో ఉన్న ఓయో గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడే ఆమెను చంపి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలోని విశాఖపట్నానికి చెందిన షారోన్‌ నిఖిత టోప్నో (23) అనే యువతి తన ప్రియుడు అయిన శ్రీనివాస రవితేజతో కలిసి హైదరాబాద్‌ కు వచ్చారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో వారిద్దరూ మాదాపూర్‌ సిద్ధిఖీ నగర్‌ రోడ్డు నంబర్‌-5లో ఉన్న ఓయో లో రూం బుక్‌ చేసుకున్నారు. అయితే మంగళవారం తెల్లవారు జామున రవితేజ ఆందోళనతో హోటల్ సిబ్బంది వద్దకు వచ్చి తనతో వచ్చిన యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిందని చెప్పాడు. వెంటనే స్పందించిన సిబ్బంది సాయంతో ఆమెను కొండాపూర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే యువతి మృతిచెందినట్లు నిర్ధారించారు.

Also Read : కోకాపేట వేలానికి సింగిల్‌ బిడ్.. రద్దు చేసిన హెచ్‌ఎండీఏ

ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది మాదాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకోగానే ఒక యువతిని ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ, హోటల్ సిబ్బంది కలిసి అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు వివరించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు పోలీసులకు వివరించారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే మృతురాలి ముఖం, తలపై తీవ్రమైన గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు. ఎప్పుడైతే యువతి మృతి చెందినట్లు తెలిసిందో ఆమె ప్రియుడు ఆస్పత్రి సిబ్బందికి కూడా చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయాడు. అనుమానంతో పోలీసులు హోటల్ గదిని పరిశీలించారు. కాగా హోటల్‌ గదిలోని గోడలు, బెడ్‌షీట్‌పై అనుమానాస్పద రక్తపు మరకలను ఉన్నట్లు గుర్తించారు. వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించారు. వివరాలు సేకరించారు. గదిలో ఖాళీ బీర్, విస్కీ బాటిళ్లు కూడా లభించాయి.

కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసు క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. హోటల్‌ గదితో పాటు పరిసర ప్రాంతాల్లోని ఆధారాలను పోలీసులు క్షణంగా పరిశీలించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని కూడా విశ్లేషిస్తున్నారు. యువతికి గాయాలు ఎలా అయ్యాయి? ఆమె మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? హోటల్‌ గదిలో అసలు ఏం జరిగింది? అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా యువతి బాయ్‌ ఫ్రెండ్‌ రవితేజ ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అతని ఫోన్ చివరి లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నమోదైందని అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు పోలీసులు తెలిపారు.

Also Read : తెలంగాణ రైతులకు అలర్ట్‌… ఈ పని పూర్తి చేయకుంటే పీఎం కిసాన్‌ ఔట్‌?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.