గణేష్ ఉత్సవాలు అంటే ముందుగా గుర్తుకువచ్చే పేరు హైదరాబాద్. అందులోనూ ఖైరతాబాద్ బడా గణేష్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ ఏడాది ఖైరతాబాద్ గణేష్‌ను అక్కడే నిర్మించి పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. 1954లో కేవలం ఒక అడుగు ఎత్తుతో శంకరయ్య ముదిరాజ్ ప్రారంభించిన ఈ గణేష్ ఉత్సవాలను ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి” 69 అడుగుల భారీ ఎత్తుతో భక్తులతో పూజలు అందుకున్నారు. ఈ విగ్రహానికి కుడివైపున 15 అడుగుల సోమనాథ జ్యోతిర్లింగం, ఎడమవైపున కాళికా మాత అమ్మవారి రూపాలను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ విగ్రహాన్ని పూర్తిగా మట్టి, జనపనార, గడ్డి, ప్రకృతి సిద్ధ రంగులతో ఎకో-ఫ్రెండ్లీ విధానంలో రూపొందించారు. ప్రతి సంవత్సరం లోక కళ్యాణం కోసం విభిన్న నామాలతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దుతారు.

ప్రతీ ఏటా భాద్రపద మాస శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున బొజ్జ గణపయ్యను మంటపాల్లో ప్రతిష్టించి ఉత్సవాలు ప్రారంభిస్తారు. అలాగే గణేషుడిని అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది శుక్రవారం 25న ప్రధాన నిమజ్జన శోభాయాత్ర జరగనుంది. అయితే ఖైరతాబాద్ మహాగణపతితో పాటు భాగ్యనగరంలోని ప్రధాన విగ్రహాలన్నీ ఈ రోజునే నిమజ్జనం చేస్తారు. బడా గణేష్‌ను నిమజ్జనం చేసే ముందు రోజు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. శోభాయాత్ర రోజున ఆలస్యం కాకుండా ఉండేందుకు ముందు రోజు పండితులు హోమం వంటి పూజలు నిర్వహిస్తారు.

Also Read : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్

నిమజ్జనానికి ముందు రోజు లోక కళ్యాణార్థం, మహా గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి ఇస్తారు.10 రోజుల పాటు మంటపంలో కొలువైన గణనాథుడి దైవత్వానికి ఉద్వాసన పలుకుతూ నిమజ్జనానికి ముందు రోజు షోడశోపచార పూజలు, స్వస్తివాచనం, ఉత్తరపూజ పూర్తి చేస్తారు. నిమజ్జనం రోజు వేకువజామున ఉదయం 4:30 నుంచి 5:00 గంటల మధ్య స్వామివారికి శోభాయాత్రకు ముందు మహాహారతి ఇస్తారు. హారతి అనంతరం విగ్రహాన్ని 30కి పైగా చక్రాలు ఉండే భారీ టస్కర్ ట్రాలీపైకి ఎక్కించి.. ఇనుప రాడ్లతో వెల్డింగ్ చేస్తారు. ప్రయాణం సురక్షితంగా సాగాలని అర్చకులు కొబ్బరికాయలు కొట్టి రథ పూజ నిర్వహిస్తారు.

విగ్రహం చాలా పెద్దది కావడం వల్ల నగరం మొత్తం తిరగకుండా తక్కువ దూరంలో నేరుగా హుస్సేన్ సాగర్‌కు చేర్చేలా పోలీసులు ప్రత్యేక రూట్ కేటాయిస్తారు. ఖైరతాబాద్ నుంచి ఉదయం 7 గంటల నుంచి శోభాయాత్ర మొదలవుతుంది. అక్కడ నుంచి బయలుదేరి ఖైరతాబాద్ లైబ్రరీ, సెన్సేషన్ థియేటర్ రోడ్ మీదుగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కూడలికి వస్తుంది. అక్కడ నుంచి సీఆర్టీసీ భవన్ పక్కనుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు సాగుతుంది.

ఎన్టీఆర్ మార్గ్‌లోని ఐమాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న హుస్సేన్ సాగర్ లేక్ వద్దకు మధ్యాహ్నం 11:00 నుండి 12:00 గంటల కల్లా చేరుకుంటుంది. అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘క్రేన్ నంబర్ 4 వద్ద భారీ హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో స్వామివారి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసే ముందు కూడా మరోసారి బడా గణేష్‌కు హారతి ఇస్తారు. అయితే హైదరాబాద్‌లో బాలాపూర్ వంటి ప్రాంతాల్లో లడ్డూను కోట్లాది రూపాయలకు వేలం వేస్తారు. కానీ ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూను ఎప్పుడూ వేలం వేయరు. ఇది ప్రజా గణపతి కావడం వల్ల ప్రసాదంపై పేద, గొప్ప తేడా లేకుండా అందరికీ సమాన హక్కు ఉండాలనే ఉద్దేశంతో ఉత్సవ కమిటీ ఆ ప్రసాదాన్ని పంచిపెడుతుంది.

Also Read : కోకాపేట వేలానికి సింగిల్‌ బిడ్.. రద్దు చేసిన హెచ్‌ఎండీఏ