
Recharge Plans :భారతదేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. ఇప్పటివరకు కేవలం 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన రీచార్జ్ ప్లాన్స్ ఇకపై 30 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (13వ సవరణ) రెగ్యులేషన్స్-2026ను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఇప్పటివరకు ఉన్న 28 రోజుల సైకిల్ ప్లాన్లు కాకుండా, నెలకు ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కలిగింది. అన్ని రకాల రీచార్జ్ ప్రొవైడర్లు ఇప్పటివరకు 28 రోజుల సైకిల్ ప్లాన్లను మాత్రమే అమలు చేసేవారు దీని వల్ల వినియోగదారులు సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్తప్లాన్ వల్ల వినియోగదారులు నెలకు ఒకసారి అంటే ఏడాదికి 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకునే అవకాశం కలిగింది.
దీనితో పాటు డేటా అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలతో కూడిన ప్లాన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా ప్రాథమిక వాయిస్ కాల్స్ కోసం మొబైల్ ఉపయోగించే తక్కువ బడ్జెట్ వినియోగదారులకు అనుగుణంగా ప్రత్యేకమైన చౌకైన ‘Special Tariff Vouchers (STVs)’ అందుబాటులోకి రానున్నాయి.
పరిమితంగా, సౌకర్యవంతంగా లేని రీచార్జ్ ఆప్షన్లపై అనేక మంది తనకు ఫిర్యాదు చేశారని రాజ్యసభ్య ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. ఈ సమస్యపై స్పందించిన ఆయన మార్చి 11న పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించి.. వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, అందుబాటు ధరల్లో రీచార్జ్ ప్లాన్స్ కల్పించాలని కోరినట్లు ఆయన చెప్పారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వినియోగదారుల ఎంపిక, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలను పరిష్కరించిందని ఆయన వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించిన కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాఘవ్ చద్దా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఈ మార్పులతో వినియోగదారులకు మరిన్ని రీచార్జ్ ఆప్షన్లు, సౌకర్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు, తక్కువ ఆదాయ వినియోగదారులకు పెద్ద విజయమని రాఘవచద్దా పోస్ట్‌లో హర్షం వ్యక్తం చేశారు. ఈ మార్పుతో ఇకపై ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ అయ్యే ప్లాన్లను టెలికాం కంపెనీలు కస్టమర్లకు అందించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.









