
AI Data Center In Space : ఇన్నాళ్లు భూమిమీదనుంచే రోదసిలోని విశేషాలను తెలుసుకునేందుకు రాకెట్లను ప్రయోగించే వాళ్లం. అయితే ఈసారి రోదసిలోనే సరికొత్త ప్రయోగం చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. భూమిపై సంభవించే భారీ తుఫాన్లు, వరదల వంటివి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. అలాంటి సందర్భాల్లో ఎక్కడ ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవడానికి మనకు ఇప్పటివరకు ఉపగ్రహాలు తీసి, పంపిన ఛాయాచిత్రాలనే ఉపయోగించేవాళ్లం..
అయితే..ఆ ఉపగ్రహాలు తీసిన ఫొటోలు భూమికి చేరడానికి, చేరినా శాస్త్రజ్ఞులు కంప్యూటర్ల ద్వారా వాటిని విశ్లేషించి ఆ వివరాలను తెలుసుకుంటారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతోంది. ఇకపై అలా ఆలస్యం కాకుండా. ఉండేందుకు రోదసిలోనే డేటా సెంటర్లను ఏర్పాటుచేయాలని పలు దేశాలు యోచిస్తున్నాయి, ఉపగ్రహాలు తీసి పంపిన ఛాయాచిత్రాలను రోదసిలోని డేటాసెంటర్‌లోనే విశ్లేషించి.. మనకు కావాల్సిన సమాచారాన్ని అవి వేగంగా చేర వేయగలిగితే? అనే ఆలోచనతో కొత్త ప్రయోగానికి ప్రయత్నాలు సాగుతున్నాయి! హైదరాబాద్‌కు చెందిన ‘టేక్‌మీ2స్పేస్’ అనే స్టార్టప్ సంస్థ ప్రయోగం ద్వారా తమ ప్రయత్నాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా రెండు ఉపగ్రహాలను రోదసిలోకి పంపడానికి ఆ సంస్థ ప్రణాళికలు రూపొందించిది. అందులో మొదటి శాటిలైట్ ‘ఎంవోఐ-1ఏ’ను అక్టోబరు 1న.. ‘స్పేస్‌ఎక్స్’ సంస్థ చేపట్టిన ట్రాన్స్‌పోర్టర్-18 రైడ్‌షేర్ మిషన్‌లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా ఇలాంటి శాటిలైట్లు.. తయారు చేసిన సమయంలో వాటిలో పొందుపరిచిన ప్రోగ్రామ్‌ల ఆధారంగా వాటికి నిర్ధేధించిన ఒక స్థిరమైన పనిని మాత్రమే చేస్తాయి. కానీ.. మనం మన ఫోన్‌లో రకరకాల యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని రకరకాల పనులు చేయించుకున్నట్టే, ఈ శాటిలైట్‌కు భూమ్మీది నుంచే మనకు కావాల్సిన అల్గారిథమ్‌లను పంపి కావాల్సిన పనిని మాత్రమే పూర్తి చేయించుకోవడానికి వీలవుతుంది.
దీనిప్రకారం ఎక్కడైనా వరదలు సంభవిస్తే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ భూమ్మీది నుంచే దీనికి నీటి ముంపు ప్రాంతాలను గుర్తించే ఒక అల్గారిథమ్‌ను పంపుతుంది. తద్వారా వరదలక సంబంధించిన డేటాను తీసుకోవడానికి వీలవుతుంది. అలాగే వ్యవసాయ శాఖ అధికారులు.. పంటలు ఎండినా, తెగుళ్లబారిన పడినా తెలుసుకునే అల్గారిథమ్‌ను పంపి.. ఏయే ప్రాంతాల్లో ఎంత పంట ఎండిపోయింది? తెగుళ్లబారిన పడిన పంట ఎంత అనే వివరాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. నౌకాదళ అధికారులు.. మన దేశ తీరానికి దగ్గరగా ఏవైనా అనుమానాస్పద ఓడలు, పడవలు ఉన్నాయేమో తెలుసుకునే అల్గారిథమ్‌ను అప్‌లోడ్ చేసి సంబధిత వివరాలు తెలుసుకోవచ్చు. దీనికోసం ఈ ఉపగ్రహంలో ఆర్బిట్ ల్యాబ్ అనే ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తారు. నిజానికి ఈ ఉపగ్రహాన్ని ఈ ఏడాది జనవరిలో ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్‌వీ సీ62 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. కానీ, మూడో దశలో తలెత్తిన టెక్నికల్ ప్రాబ్లంతో ఆ ప్రయోగం విఫలమైంది. రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోలేకపోవడంతో ప్రయోగం పూర్తిగా విఫలమైంది.
Also Read : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ కోర్సులు..ఎన్నారైలకూ అడ్మిషన్
ఈసారి మరో ప్రయత్నం
ఎంవోఐ-1ఏ తర్వాత.. ‘ఎంవోఐ-1బి’ అనే మరో శాటిలైట్‌ను కూడా ఇస్రో ఇదే ఏడాది చేపట్టే మిషన్‌లో భాగంగా కక్ష్యలోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ రెండు శాటిలైట్లూ ‘టేక్‌మీ2స్పేస్’ అనే సంస్థ 2028లో చేపట్టనున్న భారీ ప్రయోగానికి ట్రైలర్‌లుగా భావించవచ్చు. వీటిలో అమర్చే చిప్‌లు రోదసిలో ఉండే తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తాయి? అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేయనున్నారు. ఈ ఉపగ్రహాలు విజయవంతంగా పనిచేస్తే.. 2028లో ఒక్కొక్కటీ 100 కిలోల బరువుండే రెండు శాటిలైట్లను రోదసిలోకి పంపేందుకు ‘టేక్‌మీ2స్పేస్’ సంస్థ తన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ రెండు ఉపగ్రహాలూ కూడా ఒకదానికొకటి లేజర్ కిరణాలతో అనుసంధానమై ఉంటాయి. తద్వారా పూర్తిస్థాయి క్లౌడ్ డేటా సెంటర్‌లాగా పనిచేస్తాయి. ఎంవోఐ-1ఏ ఉపగ్రహంలో ఒక్క ఎన్‌విడియా చిప్ ఉంటే.. 2028లో పంపే 100 కిలోల ఉపగ్రహంలో ఏకంగా 10 ఎన్‌విడియా థోర్ చిప్‌లుంటాయని నిర్వహకులు తెలిపారు. ఆ ఉపగ్రహాలు పూర్తిస్థాయిలో పనిచేసే సమయంలో గరిష్ఠంగా 1500వాట్ల విద్యుత్తును వినియోగించుకుంటాయి.
Also Read : రాముడు-శివుడిపై సీఎం రేవంత్ కామెంట్స్.. బండి సంజయ్ కౌంటర్
గూగుల్ మాదిరిగానే కానీ,
రోదసిలో ఏఐ డేటాసెంటర్ల ఏర్పాటు చేయాలనే విషయం కొత్తదేమి కాదు ఈ విషయంలో గూగుల్ సంస్థ కూడా ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ పేరుతో ఒక భారీ మిషన్‌ను చేపట్టింది. అయితే ‘టేక్‌మీ2స్పేస్’ సంస్థ చేపట్టిన ప్రస్తుత ప్రాజెక్టు కంటే అది చాలా భారీ ప్రాజెక్టు. టేక్‌మీ2స్పేస్ పంపే శాటిలైట్లు అవి తీసిన ఫొటోలను మాత్రమే విశ్లేషించి, డేటాను కిందికి పంపుతాయి. కానీ.. గూగుల్ సంస్థ భూమ్మీద ఉన్న తరహాలోనే భారీ ఏఐ క్లౌడ్ డేటా సెంటర్లను రోదసిలో ఏర్పాటు చేయబోతుంది. అవి భూమ్మీద నుంచి పంపే డేటాను కూడా అవి విశ్లేషించగలవు. అక్టోబరు 1న ఫాల్కన్ 9 రాకెట్ మోసుకెళ్లే ఉపగ్రహాల్లో ఎంవోఐ-1ఏతోపాటు గూగుల్ ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’లో భాగంగా పంపిస్తున్న ప్రోటోటైప్ శాటిలైట్ కూడా ఉండడం విశేషం.









