
Harish Rao : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ లో నిర్వహిస్తున్న విద్యుత్ పరిశ్రమ విషయంలో రాజస్థాన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఒకవైపు కరెంటు లేక రైతుల పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే, మరోవైపు మన రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేయటం ప్రజా వ్యతిరేక చర్య కాక మరేమిటని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు అవసరం అయిన బొగ్గు మన సింగరేణి గనుల్లోనే లభిస్తుందని… నడపడానికి కావాల్సిన నీళ్లు పక్కనే ఉన్న గోదావరి నుంచే పుష్కలంగా అందుతాయన్నారు. బొగ్గు మనది, నీళ్లు మనవి, స్థలం మనది… అలాంటప్పుడు అక్కడ కొత్తగా చేపడుతున్న విస్తరణలో 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు కట్టబెట్టేలా జాయింట్ వెంచర్ ఒప్పందం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మన బొగ్గు, మన నీళ్లు, మన ప్రాంతంలో తయారయ్యే కరెంటుపై హక్కు తెలంగాణదే కదా ఉండాల్సింది. ఇటీవల సింగరేణి సంస్థ రాజస్థాన్‌కు చెందిన ఆర్ఆర్వీయూఎన్ఎల్ విద్యుత్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ ఒప్పందం ప్రకారం కొత్తగా నిర్మించే థర్మల్ విద్యుత్‌లో 800 మెగావాట్లు రాజస్థాన్‌కు కేటాయిస్తారు’’ అని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు.. తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణి… అలాంటి సింగరేణి విద్యుత్‌ను, పెట్టుబడిని రాజస్థాన్ అభివృద్ధికి ఎందుకు మళ్లించాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. మన రాష్ట్రమే కరెంటు లేక అల్లాడుతుంటే ఈ తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కనీసం 7..8 గంటలు కూడా ఇవ్వలేకపోతున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.









