ms dhoni funny ice cream moment
ms dhoni funny ice cream moment

క్రికెట్ గ్రౌండ్‌లో ఎంతో ప్రశాంతంగా కనిపించే కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. గ్రౌండ్ బయట మాత్రం అల్లరి పనులు చేస్తూ కనిపిస్తుంటారు. తాజాగా అలాంటి పని చేసే నెట్టింట వైరల్‌గా మారారు. ఇప్పుడొక వీడియో చూస్తే మాత్రం.. ‘‘అబ్బో.. ధోనీ భాయ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా’’ అని అవాక్కవడం ఖాయం. ప్రస్తుతం ధోనికి సంబంధించిన క్యూట్ అండ్ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ ఫ్యామిలీ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు ధోనీ, ఆయన భార్య సాక్షి దంపతులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చుట్టూ చాలా మంది జనాలు ఉన్నప్పటికీ.. ఇద్దరూ హుందాతనాన్ని పక్కనపెట్టి.. సరదాగా మాట్లాడుకుంటూ అందరిలో కలిసిపోయారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. అసలు అక్కడ కామెడీ సీన్ ఏముంది అనే కదా మీ డౌట్!.. ఆగండి అక్కడికే వస్తున్నా..

వైరల్ వీడియోలో.. ధోనీ చేతిలో ఐస్ క్రీమ్ కప్ ఉంది. అందులో నుంచి ఒక స్పూన్ ఐస్ క్రీమ్ తీసి ఎంతో ప్రేమగా భార్య సాక్షి వైపు తిప్పారు. భర్త తన చేతులతో ఐస్‌క్రీమ్ తినిపిస్తే ఏ భార్య వద్దంటుంది చెప్పండి. ఇక సాక్షి కూడా ‘‘హమ్మయ్య నా భర్త తన చేతులతో ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు’’ అని పొంగిపోయి.. ఆ ఐస్ క్రీమ్ తినేందుకు ఆశగా నోరు తెరిచారు. కానీ అక్కడ అసలు ట్విస్ట్ ఇచ్చారు ధోనీ.. సాక్షి నోటిదాకా వచ్చిన ఆ స్పూన్‌ను ఒక్కసారిగా వెనక్కి లాగేసుకుని దాన్ని టక్కున తన నోట్లో వేసుకున్నారు.

భర్త చేసిన ఈ పనికి సాక్షి నవ్వుతూనే ధోని చేతిపై సరదాగా కొట్టారు. అయితే ధోనీ మాత్రం ఇవేం పట్టించుకోకుండా మరోసారి కూడా ఐస్ క్రీమ్ తినిపిస్తానని అలాగే ఆటపట్టించారు. ఈ చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలైపోతుంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ అయితే పగలబడి నవ్వుకుంటున్నారు. ఏదేమైనా ఈ క్యూట్ కపుల్ చేసిన ఈ అల్లరి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.