
పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో కళ్లుబైర్లుగమ్మే భయంకరమైన ఘటన స్థానికులను, పోలీసులను షాక్కు గురిచేసింది. దసరా పండుగవేళ ఓ వ్యక్తి తన భార్య తల నరికి దేవుని ఆలయంలో పెట్టడం సంచలనంగా మారింది. అక్కడితో ఆగకుండా తన తండ్రిని సైతం నరికి చంపి పారిపోయాడు. ఈ దారుణ కాండతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం..
బంకురా జిల్లాలోని సోనాముఖి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నాట్ లాల్బాబా మనాచార్ ప్రాంతానికి చెందిన మంగళ్ చౌదరి అనే వ్యక్తి తన భార్య రుంపా (39)ని పదునైన కత్తితో తల నరికాడు. ఈ ఘర్షనలో అడ్డు వచ్చిన తన తండ్రి రాజేంద్ర చౌదరిని సైతం పొడిచి పొడిచి హతమార్చాడు. ఈ సమయంలోనే అడ్డుకోవడానికి పరుగెత్తుకొచ్చిన సోదరుడిపై కూడా దాడి చేశాడు. అతడు ఎలాగోలా తప్పించుకోగలిగాడు. ఆ తర్వాత నరికిన తన భార్య తలను సమీపంలోని ఒక గుడిలో పడేసి పారిపోయాడు.
సోమవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న సోనాముఖి, కాంక్సా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తండ్రి మృతదేహంతో పాటు గుడిలో మహిళ తలను స్వాధీనం చేసుకున్నారు. రెండు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలను పోలీసులు సమీప స్థానికులను అడగ్గా.. వారు చెప్పిన సమాధానంతో షాక్కు గురయ్యారు.
స్థానికుల కథనం ప్రకారం.. మంగళ్ చౌదరి, అతని భార్య రుంపా (39) చాలా కాలంగా ఆలయంలో కొన్ని ప్రత్యేక పూజలు చేసేవారని చెప్పారు. ఒక తాంత్రికుడు కూడా తరచూ వారి ఇంటికి వస్తుండేవాడని పేర్కొన్నారు. దీంతో క్షుద్రపూజలు, మూఢ నమ్మకాల ప్రభావంతోనే మంగళ్ చౌదరి తన భార్యను దారుణంగా తల నరికి హతమార్చి ఉంటాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.









