
Samsung And Xiaomi Prices Hiked : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని వినియోగదారులకు మొబైల్ కంపెనీలు బిగ్ షాక్ ఇచ్చాయి. సాధారణంగా తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లు, మెరుగైన నాణ్యత ఉన్న 5G ఫోన్ కావాలనుకునే వారు ఎక్కువగా శాంసంగ్, షియోమీ బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఇప్పుడు ఆ రెండు దిగ్గజ సంస్థలు మొబైల్ ధరలను పెంచేశాయి. ఏదో ఒకటి లేదా రెండు మోడళ్లపై కాకుండా ఏకంగా 41 స్మార్ట్‌ఫోన్ వేరియంట్ల ధరలను ఒక్కసారిగా పెంచాయి. ఫోన్ మోడల్, దాని స్టోరేజ్ సామర్థ్యాన్ని బట్టి కనిష్ఠంగా రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.4,000 వరకు ధరలు పెరిగాయి. పెరిగిన ఈ కొత్త ధరలు నేటి నుంచే దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
శాంసంగ్ సంస్థ తన పాపులర్ గెలాక్సీ A సిరీస్, F సిరీస్‌లలోని మొత్తం 22 వేరియంట్ల ధరలను సవరించింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే బడ్జెట్, మిడ్-రేంజ్ ఫోన్లపై ఈ ప్రభావం గట్టిగా పడింది. ఉదాహరణకు గెలాక్సీ A07 5G (4GB+128GB) వేరియంట్ ధర గతంలో రూ.20,999 ఉండగా.. ఇప్పుడు రూ.2,000 పెరిగి రూ.22,999కి చేరింది. అదేవిధంగా గెలాక్సీ F17 5G, A17 5G, A36, A56, A37 మోడళ్లపై కూడా రూ.2,000 వరకు ధర పెంచారు. ఇక గెలాక్సీ A57 సిరీస్‌లోని కొన్ని వేరియంట్లపై ఏకంగా రూ.4,000 అదనపు భారం పడింది. ఈ మార్పులతో శాంసంగ్ 5G ఫోన్లన్నీ దాదాపు రూ.20 వేల మార్కును దాటేశాయి. దీనివల్ల రూ.20 వేల లోపు మంచి శాంసంగ్ ఫోన్ కొనాలనుకునే వారికి ఆప్షన్లు బాగా తగ్గిపోయాయి.
Also Read : ప్రేమ.. డ్రగ్స్.. పాక్ లింకులు.. వెలుగులోకి సంచలన విషయాలు!
మరోవైపు షియోమీ సంస్థ కూడా తన రెడ్మీ సిరీస్‌లోని 19 వేరియంట్ల ధరలను భారీగా పెంచింది. ముఖ్యంగా తక్కువ ధరలో లభించే రెడ్మీ A7 ప్రో 5G (4GB+128GB) ఫోన్ ధరపై ఏకంగా రూ.3,000 పెంచారు. గతంలో రూ.15,999కే లభించిన ఈ ఫోన్ కోసం ఇప్పుడు రూ.18,999 చెల్లించాల్సి వస్తోంది. అంటే ఈ ఒక్క మోడల్ పైనే దాదాపు 18.75 శాతం ధర పెరిగింది. వీటితో పాటు రెడ్మీ నోట్ 17 5G ధర రూ.3,000 పెరగ్గా.. నోట్ 17 ప్రో 5G మోడల్‌పై రూ.4,000 వరకు పెంపు నమోదైంది. షియోమీ పెంచిన 19 వేరియంట్ల సగటు ధరల పెరుగుదల 10.02 శాతంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
కంపెనీలు ఒక్కసారిగా ఇంత భారీ స్థాయిలో ధరలు పెంచడానికి ప్రధాన కారణం తయారీ ఖర్చులు పెరగడమే. స్మార్ట్ఫోన్ల తయారీలో కీలకమైన మెమరీ చిప్‌లు, ప్రాసెసర్లు, ఇతర విడిభాగాల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగాయి. ఆ భారాన్ని భరించలేక కంపెనీలు ఇప్పుడు వినియోగదారులపై భారం మోపుతున్నాయి. కేవలం శాంసంగ్, షియోమీ మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో ఒప్పో, వివో, రియల్మీ వంటి ఇతర ప్రముఖ బ్రాండ్లు కూడా ఇదే బాటలో నడిచి తమ ఫోన్ల ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఇటీవల ముగిసిన పండుగ సీజన్లో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదని రిటైల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది దీపావళి సీజన్‌తో పోలిస్తే ఈసారి ఫోన్ల అమ్మకాలు 18 నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు అంచనా. పండుగకు ముందు భారీ ఆఫర్లు వస్తాయని ఆశించి చాలామంది కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. అయితే రూ.30 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండే ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్లకు మాత్రం మంచి డిమాండ్ కనిపించింది. దీనికి తోడు ఆన్లైన్ వెబ్సైట్లు, ఆఫ్‌లైన్ స్టోర్ల ధరల మధ్య ఉన్న వ్యత్యాసాలు కూడా స్థానిక వ్యాపారులకు ఇబ్బందిగా మారాయని తెలుస్తోంది.
Also Read : పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్!









