
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. గతంలో మాదిరిగా ఏళ్ల తరబడి ఫలితాల కోసం వేచి చూసే పరిస్థితికి స్వస్తి పలుకుతూ కమిషన్ నియామక ప్రక్రియలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తోంది. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు ముగిసిన కేవలం మూడు వారాల్లోపే తుది ఫలితాలను వెల్లడించనున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి అభ్యర్థుల చేతికి నియామక ఉత్తర్వులు అందే వరకు మొత్తం ప్రక్రియను గరిష్ఠంగా ఆరు నెలల్లోపే పూర్తి చేయాలని కమిషన్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
కొత్త విధానంలో సమయ పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి సరిగ్గా ఒక నెల సమయం కేటాయిస్తారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు రెండు నెలల సమయం ఇస్తారు. అనంతరం పరీక్ష తేదీలను ప్రకటించిన 25 రోజుల్లోపే కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తారు. దీనివల్ల అభ్యర్థులకు షెడ్యూల్ ఉండటంతో పాటు నియామక ప్రక్రియలో ఆలస్యం పూర్తిగా నివారిస్తారు.
Also Read : జొమాటో క్రేజీ ఫీచర్: ఇకపై 40 కి.మీ దూరంలోని రెస్టారెంట్ల నుంచీ ఫుడ్ ఆర్డర్!
ఈ నూతన విధానాన్ని టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అయితే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, రోడ్లు, భవనాల శాఖలలో చేపట్టిన నియామకాలను అత్యంత వేగంగా పూర్తి చేసింది. ముఖ్యంగా పీసీబీలో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల కోసం గత నెల 24వ తేదీన సీబీఆర్టీ పరీక్ష నిర్వహించగా.. కేవలం మూడు వారాల్లోపే ప్రాథమిక కీ విడుదల, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించారు. భవిష్యత్తులో నిర్వహించే అన్ని నియామక పరీక్షలకు ఇదే వేగవంతమైన విధానాన్ని అనుసరిస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు.
నియామక ప్రక్రియలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు, వివాదాలు తలెత్తకుండా కమిషన్ పటిష్ఠమైన చర్యలు తీసుకుంటోంది. ఒకే దశలో పరీక్షలు ఉండే నియామకాలను మూడు నెలల్లోపు, రెండు దశల్లో పరీక్షలు ఉండే వాటిని ఆరు నెలల్లోపు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా జరగడం వల్ల మూల్యాంకనం సులభతరం కావడంతో పాటు ఫలితాల విడుదల వేగవంతమైంది. పరీక్ష ముగిసిన వెంటనే సమగ్రమైన ప్రాథమిక సమాధానాల కీని విడుదల చేయడం, అభ్యంతరాలను స్వీకరించడం వంటి పనులను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఇతర నియామకాలు కూడా ఇదే వేగంతో కొనసాగుతున్నాయి. పీసీబీ ఎనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు ఈ నెల 12, 13 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి కాగా, 14వ తేదీనే తుది జాబితాను విడుదల చేసి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. అక్టోబర్ 26న జరిగిన పీసీబీ అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు సంబంధించి ఈ నెల 18, 19 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే తుది ఫలితాలు రానున్నాయి.
ఇక ఈ నెల 6, 7 తేదీల్లో సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్షల ప్రాథమిక కీ ఇప్పటికే విడుదలైంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 17వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆ వెంటనే అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి.. ఈ నెలాఖరులోగా తుది ఎంపిక జాబితాను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది.
Also Read : పాత పార్టీ పేర్లకు ఫుల్ డిమాండ్.. కవిత బాటలో విజయసాయి రెడ్డి









