Akhilesh Yadav
Samajwadi Party : దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో రాజకీయ పునరేకీకరణలు, పార్టీ ఫిరాయింపులపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న వేళ, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను తుఫాను రేగింది. యూపీ మంత్రి, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ (OP Rajbhar) రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద బాంబు పేల్చారు. ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (SP) త్వరలోనే నిలువునా చీలిపోనుందని, ఆ పార్టీకి చెందిన నేతలంతా భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యూపీ రాజకీయాల్లో దావానలంలా వ్యాపించాయి.
ఈ చీలికకు గల కారణాలను వివరిస్తూ ఓం ప్రకాష్ రాజ్‌భర్ తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో సంచలన వివరాలను పంచుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక రహస్య లేఖను అందజేశారని ఆయన పేర్కొన్నారు. గత ఎస్పీ ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ (గనుల) కుంభకోణం, గోమతి రివర్ ఫ్రంట్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో యూపీలో ప్రతి ఒక్కరికీ తెలుసని, ఇప్పుడు ఆయా కేసులలో దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తుండటంతో ఎస్పీ అగ్రనాయకత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోందని రాజ్‌భర్ వ్యాఖ్యానించారు. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకే మహారాష్ట్ర, బెంగాల్ తరహాలోనే ఎస్పీ మొత్తం బీజేపీ గూటికి చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

రాజ్‌భర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అత్యంత ఘాటుగా స్పందించింది. తమ పార్టీ త్వరలో చీలిపోతుందనే ప్రచారాన్ని ఎస్పీ తీవ్రంగా ఖండించింది. తమ పార్టీ బలాన్ని చూసి బీజేపీ,దాని మిత్రపక్షాలు బెంబేలెత్తుతున్నాయని, అందుకే ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతున్నాయని మండిపడింది. ఎస్పీ అధికార ప్రతినిధి సునీల్ సాజన్ మాట్లాడుతూ..”తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే రాజ్‌భర్ ఇలాంటి చౌకబారు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ బలాన్ని సమాజ్‌వాదీ పార్టీ సగానికి సగం తగ్గించేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఆ భయంతోనే కేవలం ప్రచారం కోసం రాజ్‌భర్ అబద్ధాలు చెప్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పార్టీ (SBSP) నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేరు.” అని ఘాటుగా సమాధానమిచ్చారు.
గతంలోనూ అఖిలేష్ యాదవ్ లక్ష్యంగా విమర్శలు:
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని ఓపీ రాజ్‌భర్ విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల అఖిలేష్ యాదవ్ విదేశీ పర్యటనలపై కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అఖిలేష్ లండన్, పారిస్ వంటి విదేశీ నగరాలకు వెళ్లే బదులు.. యూపీలోని కాశీ, అయోధ్య, మధుర, నైమిశారణ్యం, వింధ్యావాసిని వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి ఉంటే బాగుండేదని హితవు పలికారు. దానివల్ల ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగానికి ఊపు రావడంతో పాటు, స్థానిక వ్యాపారులు, రవాణా రంగంపై ఆధారపడిన పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరేదని గతంలో వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అటు అధికార ఎన్డీఏ కూటమి, ఇటు విపక్ష ‘ఇండియా’ కూటమి ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో అధికార పక్షంలో మంత్రిగా ఉన్న రాజ్‌భర్.. ప్రతిపక్ష పార్టీ చీలిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ రచ్చ కోసమేనా? లేక తెరవెనుక నిజంగానే ఎస్పీ నేతలపై దర్యాప్తు సంస్థల ఒత్తిడి పెరుగుతోందా? అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.