LOC

LOC  :  లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఓ అరుదైన అండ్ ఎమోషనల్ సంఘటన చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్ బోర్డర్ దాటి భారత్‌లోకి ఎంటర్ అయిన ఒక పాకిస్థాన్ పౌరుడిని ఇండియన్ ఆర్మీ సురక్షితంగా తిరిగి వారి దేశానికి అప్పగించింది. రెండు దేశాల మధ్య తీవ్రమైన విభేదాలు, శత్రుత్వం కొనసాగుతున్నప్పటికీ.. ఈ అప్పగింత సమయంలో భారత సైన్యానికి చెందిన ఒక మేజర్ ర్యాంక్ ఆఫీసర్, పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్‌తో చేతులు కలపడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆర్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌కు చెందిన అసద్ ఖాన్ అనే వ్యక్తి జూన్ 12న కుప్వారా జిల్లాలోని తీత్వాల్ సెక్టార్, సిమారి విలేజ్ వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ దాటడానికి ప్రయత్నిస్తూ ఇండియన్ ఆర్మీకి చిక్కాడు. ఆర్మీ కస్టడీలో ఉన్న టైంలో అతడిని ఎంతో గౌరవంగా, మానవత్వంతో చూసుకున్నట్లు భారత సైన్యం తెలిపింది. జూన్ 18న బోర్డర్ క్రాసింగ్ పాయింట్ వద్ద అతడిని తిరిగి పాక్ ఆర్మీకి సక్సెస్‌ఫుల్‌గా అప్పగించారు.

సోషల్ మీడియాలో భారీగా రిక్వెస్ట్‌లు

అసద్ ఖాన్ ఆర్మీకి దొరికిన తర్వాత.. అతడిని వదిలేయాల్సిందిగా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతం నుండి సోషల్ మీడియాలో భారీగా రిక్వెస్ట్‌లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ మానవతా విలువలను ప్రదర్శిస్తూ అతడిని సురక్షితంగా స్వదేశానికి పంపించిందని ఆర్మీ తన ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొంది. శతృదేశ పౌరుడైనప్పటికీ తమ బసలో అసద్ ఖాన్‌ను ఎంతో హుందాగా చూసుకోవడం అనేది ఇండియన్ ఆర్మీ ప్రొఫెషనల్ వాల్యూస్, బాధ్యత అండ్ మిలిటరీ నైతికతకు నిదర్శనమని ఆర్మీ స్పష్టం చేసింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.