దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 23వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. దేశంలోని 9.44 కోట్లకు పైగా రైతు కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోలోకి సుమారు రూ.18,880 కోట్లు నేరుగా ఒకేసారి జమ కానున్నాయి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మొత్తం రూ.6 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తారు. కాగా గత మార్చి 13న అస్సాంలోని గువహటి నుండి రూ.18,640 కోట్లను 9.32 కోట్ల మంది రైతులకు 22వ విడత కింద ప్రధాని విడుదల చేశారు.

మీ పేరు ఉందో లేదో ఇలా చూసుకోండి

మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపించే ‘Beneficiary list’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ ఉన్న డ్రాప్-డౌన్ ఆప్షన్ల నుంచి మీ రాష్ట్రం, జిల్లా, సబ్-డిస్ట్రిక్ట్, గ్రామం వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ‘Get report’ పై క్లిక్ చేస్తే మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల పూర్తి జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే రైతులు 155261 లేదా 011-24300606 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు.

మీ అకౌంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం

మీ ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయా లేదా అనే స్టేటస్ తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ హోంపేజీలో కుడి వైపున ఉన్న ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్, స్క్రీన్‌పై ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, ‘Get Data’ పై క్లిక్ చేస్తే మీ ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలు, డబ్బులు పడ్డాయో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే హోంపేజీలోనే ‘New Farmer Registration’ పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ సాయంతో పూర్తి వివరాలు నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు.