అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త విలాసవంతమైన విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్‌లోకి చేర్చుకున్నారు. ఖతార్ రాజకుటుంబం అమెరికాకు బహుమతిగా ‘బోయింగ్ 747-8’ రకం విమానాన్ని ఇచ్చింది. ఈ సరికొత్త విమానానికి ‘వీసీ-25బీ బ్రిడ్జ్’ అని పేరు పెట్టారు. మేరీల్యాండ్‌లోని వైమానిక దళ హ్యాంగర్‌లో ఉన్నతాధికారుల సమక్షంలో అధ్యక్షుడు ట్రంప్ ఈ విమానాన్ని ప్రపంచానికి చూపించారు. ఇకపై ట్రంప్ ఈ విమానంలోనే అధికారిక పర్యటనలు చేయనున్నారు.

ఈ విమానం కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా.. ఆకాశంలో ప్రయాణించే ఒక ‘ఎగిరే వైట్ హౌస్’ లాగా పనిచేస్తుందని ట్రంప్ అన్నారు. ఇంతకు ముందెన్నడూ ఎవరూ ఇలాంటి అద్భుతమైన విమానాన్ని చూసి ఉండరన్నారు. విమానం లోపలి భాగమంతా బాగుంటుందని, లగ్జరీ చెక్క ప్యానెలింగ్‌తో విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్ రూమ్‌ను తలపించేలా డిజైన్ ఉంటుందని తెలిపారు. విమానం తోక భాగంపై అమెరికా జాతీయ జెండాను ముద్రించారు.

ఖతార్ నుండి బహుమతిగా వచ్చిన ఈ విమానాన్ని అమెరికా అధ్యక్షుడి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్చడానికి భారీగానే ఖర్చు పెట్టారు. ఈ విమాన రంగును కూడా ట్రంప్ తన ఇష్టానికి తగ్గట్టుగా మార్చుకున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుల విమానాలు లేత ఆకాశ నీలం, వెండి రంగులతో ఉండేవి. కానీ.. ఈ కొత్త విమానానికి ముదురు నీలం, ఎరుపు, తెలుపు రంగులను ఉపయోగించారు. విమానం కింది భాగానికి ముదురు నీలం రంగు వేసి, మధ్యలో ఒక ప్రకాశవంతమైన చారను డిజైన్ చేశారు. విమానం ఎక్కే ఎడమవైపు తలుపు దగ్గర అధ్యక్ష అధికారిక ముద్రను పెట్టారు.

ఖతార్ ఈ విమానాన్ని ఉచితంగానే ఇచ్చింది. కానీ అమెరికా సైనిక, రక్షణ అవసరాలకు తగినట్లుగా మార్చడానికి యూఎస్ ప్రభుత్వం ఏకంగా 400 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 3,300 కోట్లు ఖర్చు చేసింది. ఈ విమానం లోపల, బయట అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్స్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను అమెరికన్ ఇంజనీర్లు అమర్చారు. శత్రువుల నుంచి ఎలాంటి ముప్పు రాకుండా ఉండేలా ఈ విమాన రక్షణ వలయాన్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది.