
మన దేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు ఏపీలో పెద్ద బంగారు నిధి బయటపడింది. భూమి గర్భంలో దాదాపు 50 టన్నుల బంగారం ఉన్నట్లు అధికారులు కనిపెట్టారు. ఈ బంగారాన్ని బయటకు తీయడానికి త్వరలోనే తవ్వకాలు కూడా మొదలుపెట్టబోతున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే.. రాబోయే కొద్ది రోజుల్లోనే మన దేశంలోనే అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. ఈ బంగారాన్ని వెలికితీయడానికి రాష్ట్రంలో నాలుగు ముఖ్యమైన స్థలాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, రామగిరి, జవ్వకుల, చిగురుకుంట బిశ్నతం అనే ప్రాంతాలలో బంగారం కోసం తవ్వకాలు జరపనున్నారు. ఒక్క జొన్నగిరిలోనే ఎక్కువగా బంగారం దాగి ఉందని అధికారులు చెబుతున్నారు.
కర్నూలులోని జొన్నగిరి గ్రామంలో బంగారం కోసం పదేళ్ల క్రితమే 1,500 ఎకరాల భూమిని పక్కన పెట్టారు. అందులో కేవలం 500 ఎకరాల్లో వెతకగానే 13 టన్నుల బంగారం దొరికింది. ఇప్పుడు మిగిలిన 1,000 ఎకరాల్లో కూడా తవ్వకాలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మొత్తం 50 టన్నుల బంగారం విలువ మన మార్కెట్ ధరల ప్రకారం చూస్తే కనీసం రూ. 7,500 కోట్ల నుంచి రూ. 9,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే భూమిలోంచి బంగారం తీయడం అంత ఈజీ కాదు. దీనికి చాలా ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద మిషన్లు కావాలి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే భూమి లోపల నుంచి ఒక టన్ను మట్టి, రాళ్లను బయటకు తీసి క్లీన్ చేస్తే అందులోంచి కేవలం ఒక గ్రాము బంగారం మాత్రమే వస్తుంది. ఒక టన్ను మట్టికి కనీసం ఒక గ్రాము బంగారం కూడా రాకపోతే ఆ తవ్వకాలు వేస్ట్ అని అధికారులు అంటున్నారు. అందుకే ఈ కష్టమైన పనులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మన దేశంలో జనాలు ఏడాదికి దాదాపు 800 టన్నుల బంగారాన్ని కొంటున్నారు. కానీ మన దగ్గర బంగారం అస్సలు దొరకడం లేదు. 2000 సంవత్సరంలో కర్ణాటకలోని ఫేమస్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూతపడినప్పటి నుంచి ఇండియాలో గోల్డ్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం కర్ణాటకలోని ‘హుట్టి గోల్డ్ మైన్స్’ మాత్రమే ఏడాదికి ఒక ఒకటిన్నర టన్ను బంగారం తీస్తోంది. మిగతా బంగారం అంతా విదేశాల నుంచి భారీగా డబ్బులు పెట్టి కొంటున్నాం. ఇప్పుడు ఏపీలో ఈ నిధి బయటపడటంతో బంగారం ధరలు తగ్గవచ్చని భావిస్తున్నారు.









