Mother kills son : వివాహేతర సంబంధాల మోజులో పడి కన్నప్రేమను, నవమాసాలు మోసి కన్న బిడ్డను కాలరాస్తున్న కసాయి తల్లుల దారుణాలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. ప్రియుడితో గడిపే ఏకాంత సమయానికి అడ్డువస్తున్నాడనే కారణంతో, కంటికి రెప్పలా కాపాడాల్సిన రెండేళ్ల కన్నకుమారుడిని ఓ తల్లే అత్యంత కిరాతకంగా హతమార్చింది. గుండెలను పిండేసే ఈ అమానుష ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనం రేపుతోంది.

పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌ గ్రామానికి చెందిన స్వామి, జ్యోతిలకు వివాహమై ఓ నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కొడుకు ఉన్నారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వలస వచ్చిన ఈ కుటుంబం మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో నివాసముంటోంది. స్వామి క్యాబ్ డ్రైవర్‌గా రాత్రింబగళ్లు కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా, జ్యోతి గృహిణిగా ఉంటూ పిల్లలను చూసుకునేది. అయితే జ్యోతికి పెళ్లి కాకముందు నుంచే యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా భర్త కళ్లుగప్పి ప్రియుడితో గుట్టుచప్పుడు కాకుండా ఆ బంధాన్ని కొనసాగిస్తూనే వచ్చింది.

భర్త స్వామి క్యాబ్ డ్రైవింగ్ డ్యూటీకి వెళ్లడమే ఆలస్యం, ప్రియుడు నవీన్ నేరుగా కీసరలోని జ్యోతి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే గత నెల మే 29న స్వామి ఎప్పటిలాగే విధులకు వెళ్లగా, నవీన్ జ్యోతి దగ్గరకు వచ్చాడు. ఇద్దరూ బెడ్‌రూమ్‌లో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో, జ్యోతి రెండేళ్ల చిన్నారి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ఆ ఏడుపు విన్న నవీన్‌కు విపరీతమైన కోపం వచ్చింది. పిల్లాడి ఏడుపు శబ్దం బయటకు వినపడితే చుట్టుపక్కల వారికి తెలిసిపోయి తమ బంధం బయటపడుతుందని భయపడ్డాడు. “వీడు మనకు అడ్డుగా ఉన్నాడు, వీడిని ఇప్పుడే చంపేద్దాం” అంటూ జ్యోతితో అన్నాడు.

కామంతో కళ్లు మూసుకుపోయి, ప్రియుడి మోజులో పూర్తిగా అంధురాలైన ఆ కసాయి తల్లి క్షణమైనా ఆలోచించకుండా పచ్చ జెండా ఊపింది. ఇంకేముంది, ఇద్దరూ కలిసి ఏడుస్తున్న ఆ రెండేళ్ల పసికందును ఏమాత్రం కనికరం లేకుండా గాల్లోకి లేపి నేలకేసి అత్యంత దారుణంగా కొట్టారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆ అభం శుభం తెలియని చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం భర్త స్వామి ఇంటికి రాగానే ఏమీ తెలియనట్లు నటిస్తూ.. బాబుకు అకస్మాత్తుగా ఫిట్స్ (మూర్ఛ వ్యాధి) వచ్చి చనిపోయాడని కట్టుకథ అల్లి ఏడ్చింది. ఆమె మాటలను నిజమేనని నమ్మి భర్త, బంధువులు కలిసి బాబుకు అంత్యక్రియలు కూడా పూర్తి చేసేశారు.

అంత్యక్రియలు ముగిసిన తర్వాత జ్యోతి ప్రవర్తనలో మార్పులు రావడం, మునుపటిలా కాకుండా భయపడుతూ ఉండటాన్ని భర్త స్వామి గమనించాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా ఆమె బుకాయించింది. దీంతో స్వామి ఊరుకోకుండా గ్రామ పెద్దల ముందు పంచాయితీ పెట్టించి, బంధువుల సమక్షంలో పదే పదే ఒత్తిడి చేయడంతో జ్యోతి తట్టుకోలేక తనే నవీన్ కోసం కొడుకును చంపేసినట్లు నిజం ఒప్పుకుంది. దీంతో స్వామి తీవ్ర దిగ్భ్రాంతికి గురై కన్నీరుమున్నీరవుతూ వెంటనే కీసర పోలీస్ స్టేషన్‌లో భార్యపై ఫిర్యాదు చేశాడు.

భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, పూడ్చిపెట్టిన బాలుడి మృతదేహాన్ని వెలికితీసి తహశీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. శవపరీక్ష నివేదికలో బాలుడి తలకు బలమైన గాయం కావడం వల్లే మరణించాడని వైద్యులు ధృవీకరించడంతో జ్యోతి పాపం పూర్తిగా పండింది. కన్న కొడుకును పొట్టనబెట్టుకున్న కసాయి తల్లి జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించగా.. ఈ దారుణానికి ప్రధాన కారకుడై ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రియుడు నవీన్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.