Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ యువ సంచలనం, 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచాన్ని అవాక్కేలా చేశాడు. శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ టీనేజ్ ఓపెనర్ సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ఈ టైటిల్ పోరులో లంక బౌలర్లపై నిర్దయాత్మకంగా విరుచుకుపడుతూ, పురుషుల ‘లిస్ట్-ఏ’ (List A) క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేశాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక-ఎ జట్టుకు వైభవ్ తొలి బంతి నుంచే చుక్కలు చూపించాడు. మైదానం నలుమూలలా భీకర షాట్లతో విరుచుకుపడుతూ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. దీనితో లిస్ట్-ఏ క్రికెట్‌లో 21 ఏళ్ల క్రితం (2005లో) లంక ఆటగాడు కౌశల్య వీరరత్నే (12 బంతుల్లో) నెలకొల్పిన అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ప్రపంచ రికార్డును ఈ బిహార్ బుడ్డోడు తుడిచిపెట్టేశాడు.
హాఫ్ సెంచరీ తర్వాత కూడా ఏమాత్రం తగ్గని వైభవ్.. కేవలం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో 94 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ పేరిట ఉన్న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన లిస్ట్-ఏ సెంచరీ (29 బంతుల్లో) రికార్డును సమం చేసేలా కనిపించాడు. కానీ, దురదృష్టవశాత్తూ లంక కెప్టెన్ సహన్ అరాచ్చిగే వేసిన 9వ ఓవర్లో అవుట్ కావడంతో కేవలం 6 పరుగుల దూరంలో చారిత్రాత్మక శతకాన్ని చేజార్చుకున్నాడు. అయినప్పటికీ అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ లంక బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా కుదిపేసింది.
ఈ సిరీస్ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన సూపర్ ఓవర్ ఓటమి, ఆ తర్వాత మైదానంలో లంక ఆటగాళ్లతో జరిగిన ఘర్షణ వాతావరణాన్ని మనసులో ఉంచుకున్న వైభవ్.. ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఫైనల్‌కు కొన్ని గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘100’ అని రాసి ప్రతీకారానికి సిద్ధమయ్యాడు. అన్నట్లుగానే లంక బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ తన బ్యాట్‌తోనే వారికి సరైన సమాధానం ఇచ్చాడు. ఇటీవల ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరెంజ్ క్యాప్ గెలిచి, భారత్‌ సీనియర్‌ టీ20 జట్టుతో పాటు ఆసియా క్రీడలకు ఎంపికైన వైభవ్.. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో సెలెక్టర్ల నమ్మకాన్ని మరోసారి నిజం చేశాడు.
భారీ స్కోరు దిశగా భారత్ ‘ఎ’..
వైభవ్ సూర్యవంశీతో పాటు మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కూడా మెరుపు బ్యాటింగ్‌తో 29 బంతుల్లో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరి విధ్వంసకర ఆరంభంతో భారత్ ‘ఎ’ జట్టు ఇన్నింగ్స్ ఆరంభంలో టీ20 కంటే వేగంగా దూసుకెళ్లింది. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ వ్యవధిలోనే అవుట్ కావడంతో మ్యాచ్ కాస్త నెమ్మదించినప్పటికీ, ఆ తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ (67 పరుగులు), అనుకుల్ రాయ్ (39 పరుగులు) రాణించడంతో భారత్ ‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.