
NEET: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (NEET) రీ-ఎగ్జామ్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినుల పట్ల భద్రతా సిబ్బంది ప్రవర్తించిన తీరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్షల్లో అక్రమాలను, కాపీయింగ్‌ను అడ్డుకునే నెపంతో తనిఖీలు చేసిన సిబ్బంది, విద్యార్థినుల పట్ల అత్యంత అవమానకరంగా, అనాగరికంగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల పేరుతో బాలికల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ.. యథేచ్ఛగా బాడీ ఇన్వేసివ్ ఫ్రిస్కింగ్ (శరీరాన్ని తాకుతూ జరిపే తనిఖీలు)కు పాల్పడ్డారని పలువురు బాధిత విద్యార్థినులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను పంచుకుంటున్నారు.
పరీక్షా కేంద్రాల్లో ఎదురైన ఘోరమైన అనుభవాలపై ఓ బాధిత విద్యార్థిని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న వివరాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పీరియడ్స్ (నెలసరి) సమయంలో ఆమె పరీక్షకు హాజరుకాగా, మెటల్ డిటెక్టర్ తనిఖీ చేసే క్రమంలో భద్రతా సిబ్బంది ఆమెను తీవ్రంగా అనుమానించారు. తాను శానిటరీ ప్యాడ్ ధరించానని సదరు విద్యార్థిని మొరపెట్టుకున్నప్పటికీ సిబ్బంది వినలేదు. అది నిజమేనని నిరూపించుకోవడానికి పరీక్షా కేంద్రం ముందే ఆమె ప్యాంటును కిందికి దించి చూపించాలని బలవంతం చేయడం అత్యంత అమానుషంగా మారింది.
పరీక్ష రాయాలనే తీవ్రమైన టెన్షన్లో ఉన్న ఆ విద్యార్థిని, సిబ్బంది పెట్టిన ఒత్తిడికి తలొగ్గి ఆ ఘోర అవమానాన్ని భరిస్తూనే వారు చెప్పినట్లు చేయాల్సి వచ్చింది. అయితే ఇలాంటి వికృత అనుభవం కేవలం ఒక్క విద్యార్థినికే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పలు పరీక్షా కేంద్రాల్లో వేల కొద్దీ విద్యార్థినులకు ఎదురైందని సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు, పోస్టుల ద్వారా స్పష్టమవుతోంది. కఠిన నిబంధనల పేరుతో విద్యార్థినుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా తనిఖీలు సాగాయని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదే కాకుండా మరికొందరు విద్యార్థినులకు ఇన్నర్‌వేర్ తనిఖీల విషయంలోనూ తీవ్ర అవమానం ఎదురైంది. వారు ధరించిన ‘బ్రా’ మెటల్ హుక్స్ లేదా స్ట్రిప్స్ కారణంగా మెటల్ డిటెక్టర్ శబ్దం (బీప్ సౌండ్) చేసిందని, దాంతో సిబ్బంది వారిని లోపలి ప్రత్యేక గదుల్లోకి తీసుకెళ్లారని బాధిత బాలికలు వాపోయారు. అక్కడ ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించిన మహిళా సిబ్బంది, విద్యార్థినుల చేత బలవంతంగా బ్రాలను విప్పించి మరీ అత్యంత అవమానకరంగా తనిఖీలు చేశారని వారు కన్నీటిపర్యంతమయ్యారు.
పరీక్షా హాల్లోకి అడుగుపెట్టే ముందే బాలికల పట్ల భద్రతా సిబ్బంది ప్రవర్తించిన ఈ అనాగరిక చర్యలు వారిని మానసికంగా తీవ్రంగా కుంగదీశాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన, కెరీర్‌ను నిర్ణయించే పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థినులు.. ప్రశాంతంగా పరీక్ష రాయాల్సింది పోయి తీవ్రమైన ఒత్తిడికి, మానసిక క్షోభకు గురయ్యారు. ఈ అవమాన భారంతో ఎంతోమంది పరీక్షను సరిగ్గా రాయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘోరమైన పరిణామాలపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైఖరిపై వారు మండిపడుతున్నారు. భద్రత, తనిఖీల పేరుతో విద్యార్థినులను మానసిక వేధింపులకు గురిచేసే హక్కు ఎవరికీ లేదని, తనిఖీలకు కనీస మర్యాదలు, మానవతా దృక్పథం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అనాగరిక చర్యలకు కారణమైన సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు గళమెత్తుతున్నాయి.









