
వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఎప్పుడూ చల్లగా ఉండే ఐరోపా ఖండం ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారుతోంది. ప్రస్తుత వేసవిలో స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి. ఇటలీలోని బోలోన్యా, ఫ్లోరెన్స్, మిలన్ వంటి ఎనిమిది నగరాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటడంతో అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ విపరీతమైన వేడి వాతావరణాన్ని ‘హీట్ డోమ్’ అని అంటారు. అయితే సహారా ఎడారి నుంచి ఉత్తర దిశగా వీస్తున్న వేడి గాలుల వల్లే ఐరోపాలో ఈ హీట్ డోమ్ పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ హీట్ డోమ్ అంటే ఏంటి? దీనివల్ల భారత్‌కు ముప్పు ఉందా? తెలుసుకుందాం.
Also Read : ఖమేనీ అంత్యక్రియలకు రండి.. మోదీకి ఇరాన్ పిలుపు!
Heat Dome
హీట్ డోమ్ అంటే వాతావరణంలో ఒక నిర్దిష్ట ప్రాంతంపై ఎక్కువ పీడనం ఏర్పడినప్పుడు.. అది తన చుట్టుపక్కల ఉన్న వేడి గాలిని బయటకు పోనివ్వకుండా ఒక చోటే నొక్కి ఉంచుతుంది. ఒక గిన్నెను బోర్లించినట్లుగా వేడి గాలిని ఒకే చోట బంధించడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతాయి. సూర్యుడి వేడి వల్ల భూమి మరింత వేడెక్కి.. ఆ వేడి గాలి పైకి లేవడానికి ప్రయత్నించినా పైన ఉన్న అధిక పీడనం దాన్ని మళ్లీ కిందికి నెట్టేస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతం అంతా ఒక ఓవెన్‌లా మారిపోతుంది. దీనివల్ల తీవ్రమైన నష్టాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా చల్లటి వాతావరణానికి అలవాటు పడిన ఐరోపా ప్రజలు ఈ హఠాత్తు వేడిని తట్టుకోలేక వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే విపరీతమైన వేడి, పొడి వాతావరణం వల్ల అడవుల్లో కార్చిచ్చులు చెలరేగి వేగంగా వ్యాపిస్తాయి. ఇళ్లలో ఏసీలు, కూలర్ల వాడకం ఒక్కసారిగా పెరగడం వల్ల పవర్ గ్రిడ్లపై ఒత్తిడి పెరిగి విద్యుత్ కొరత ఏర్పడుతుంది. నదులు, జలాశయాలు ఎండిపోయి తీవ్ర నీటి ఎద్దడి రావడంతో పాటు పంటలు ఎండిపోయి వ్యవసాయ రంగం నష్టపోతుంది.
ప్రస్తుతం ఐరోపాను కుదిపేస్తున్న ఈ నిర్దిష్ట ‘హీట్ డోమ్’ సహారా ఎడారి గాలుల వల్ల ఏర్పడటం చేత భారతదేశంపై నేరుగా ఎలాంటి ప్రభావం చూపించదు. అయితే గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో భారతదేశంలోనూ ఇలాంటి హీట్ డోమ్ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ ఇలాగే పెరిగితే మన దేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా ఇలాంటి ప్రమాదకరమైన హీట్ డోమ్స్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : హర్మూజ్‌లో చల్లారని మంటలు.. టోల్ టాక్స్ తప్పదా?









