
Mumbai Local Train :ముంబై లోకల్ ట్రైన్లో కేవలం ఒక చిన్న వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న దారుణ సంఘటన తీవ్ర కలకలం రేపింది. వర్షం పడుతున్న సమయంలో రైలు కోచ్ డోరు మూసే విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ కాస్తా.. చివరకు ఒకరి అత్యంత పాశవిక హత్యకు దారితీసింది.ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…
ముంబైలోని విరార్ ప్రాంతానికి చెందిన మయాంక్ లోహర్ (22) అనే యువకుడు అంధేరిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి తన విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు చర్చ్‌గేట్ నుంచి నల్లాసోపారా వెళ్లే ఫాస్ట్ లోకల్ రైలులోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కాడు. ఆ సమయంలో ముంబైలో భారీ వర్షం కురుస్తుండటంతో, కోచ్ డోర్ గుండా వర్షపు నీరు లోపలికి రాకుండా తలుపు మూసివేయాలని మయాంక్ అక్కడ ఉన్న మరో తోటి ప్రయాణికుడికి చెప్పాడు. అయితే, అందుకు సదరు ప్రయాణికుడు నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
ముంబై లోకల్ ట్రైన్లో దారుణం.
డోర్ విషయంలో యువకుడి హత్య..!లోకల్ ట్రైన్ వేగంగా వెళ్తోంది.
మరోవైపు భారీవర్షం కురుస్తోంది.
ఇంతలో చిన్న వాగ్వాదం.
డోర్ మూసివేసే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ.
ఫలితం, రక్తపాతం.
22ఏళ్ల యువకుడు మయాంక్ దారుణ హత్య.ఘర్షణ పెద్దది కావడంతో నిందితుడు… pic.twitter.com/MSDmrc47l0
— Ravi Prakash Official (@raviprakash_rtv) June 24, 2026
అంధేరి – బోరివలి స్టేషన్ల మధ్య (గోరేగావ్ – కందివాలి ప్రాంతంలో) ఈ వివాదం కాస్తా ముదిరి పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గుర్తుతెలియని దుండగుడు.. అకస్మాత్తుగా తన వద్ద దాచుకున్న పదునైన కత్తిని బయటకు తీసి, విచక్షణా రహితంగా మయాంక్ కడుపులో బలంగా పొడిచాడు. కంపార్ట్మెంట్లో ప్రయాణికులు చుట్టూ ఉన్నప్పటికీ, ఊహించని ఈ దాడితో అందరూ షాక్‌కు గురయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మయాంక్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రాత్రి 11:04 గంటల సమయంలో రైలు బోరివలీ స్టేషన్‌కు చేరుకోగానే.. రైలు పూర్తిగా ఆగకముందే నిందితుడు ప్లాట్‌ఫారమ్‌పైకి దూకి జనం రద్దీలోకి దర్జాగా నడుచుకుంటూ పారిపోయాడు.
రైలు బోరివలీ స్టేషన్లో ఆగగానే తోటి ప్రయాణికుల హాహాకారాల మధ్య పశ్చిమ రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. రక్తపు మడుగులో పడి ఉన్న మయాంక్‌ను పోర్టర్ల సహాయంతో అత్యవసరంగా బోరివలీ స్టేషన్‌లోని మెడికల్ రూమ్‌కు, ఆ తర్వాత రాత్రి 11:42 గంటలకు కందివలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, అందులో మయాంక్ మృతదేహం డోర్ వద్ద రక్తపు మడుగులో పడి ఉండటం, ప్రయాణికులు భయంతో అరవడం కనిపిస్తోంది.
ఈ దారుణ ఘటనపై బోరివాలి రైల్వే పోలీస్ అధికారి దత్త ఖుప్రేకర్, పశ్చిమ రైల్వే అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఉన్నతాధికారులు బోరివలీ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి ఏడు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. అందులో భాగంగా అంధేరి, మలాడ్, బోరివలీ రైల్వే ప్లాట్‌ఫారమ్‌లలోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తూ నిందితుడి ఆనవాళ్ల కోసం గాలిస్తున్నారు.









