TG PGECET 2026 :తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మ్.డి (పీబీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ పీజీ కోర్సుల అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారికంగా విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన అత్యున్నత స్థాయిలో జరిగిన అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ఈ ప్రవేశాల క్యాలెండర్‌ను ఖరారు చేశారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ నేడు వెలువడనుందని టీజీ సెట్స్ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు పూర్తి వివరాలు, ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ https://pgecetadm.tgche.ac.in ను సందర్శించాలని అధికారులు సూచించారు.

ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రత్యేక కేటగిరీల కింద వచ్చే ఎన్‌సీసీ (NCC), క్యాప్ (CAP), పీహెచ్ (PH), స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణీత తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ (OU) క్యాంపస్‌లోని ‘డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్’ కేంద్రానికి నేరుగా హాజరై, తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను అధికారుల చేత వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక కోర్సుల వారీగా చూస్తే, ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ జులై 2వ తేదీన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల అప్‌లోడింగ్‌తో ప్రారంభమై జులై 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జులై 7 నుండి 9 వరకు జరుగుతుంది. అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను జులై 12న వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. ఈ అభ్యర్థులు జులై 13 నుండి 15 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవడానికి, జులై 16న వాటిని సవరించుకోవడానికి అవకాశం కల్పించారు. చివరగా జులై 19న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు జులై 20 నుండి 24వ తేదీల మధ్య సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేసి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.

మరోవైపు ఎంఫార్మసీ, ఫార్మ్ డి (పీబీ) కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియ జులై చివరి వారంలో ప్రారంభం కానుంది. ఈ కోర్సుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల అప్‌లోడింగ్ జులై 26 నుండి 31 వరకు జరుగుతుంది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను జులై 29 నుండి 31 వరకు నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆగస్టు 3న విడుదల చేసి, ఆగస్టు 4 నుండి 6 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు సమయం ఇస్తారు. ఆగస్టు 7న వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం కల్పించి, ఆగస్టు 10న సీట్ల కేటాయింపును పూర్తి చేస్తారు. సీట్లు సాధించిన అభ్యర్థులు ఆగస్టు 11 నుండి 14వ తేదీల లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి ఆ షెడ్యూల్‌లో పేర్కొంది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.