
AIIMS : ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నాహాలు చేస్తున్న నిరుద్యోగులకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఒక భారీ నోటిఫికేషన్‌తో అద్భుతమైన శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిమ్స్ సంస్థలతో పాటు, దానికి అనుబంధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,484 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రూప్-బీ, గ్రూప్-సీ కేటగిరీల కిందకు వచ్చే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (CRE-2026) ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 59 రకాల విభిన్న పోస్టులు ఉండటంతో.. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా నుంచి పీజీ వరకు వివిధ రకాల విద్యార్హతలు కలిగిన అభ్యర్థులందరికీ తమ అర్హతలకు తగిన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న కొన్ని ప్రధాన పోస్టులు, వాటి అర్హతల వివరాలను పరిశీలిస్తే.. అసిస్టెంట్ డైటీషియన్ పోస్టులకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌లో ఎంఎస్సీతో పాటు రెండేళ్ల అనుభవం, గరిష్ట వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే డైటీషియన్ పోస్టులకు హోమ్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్‌లో పీజీతో పాటు మూడేళ్ల అనుభవం అడిగారు. వార్డెన్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీతో పాటు హోమ్ సైన్స్ డిప్లొమా, రెండేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) పోస్టులకు డిగ్రీతో పాటు ఆఫీస్ పనులపై అవగాహన ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులకు ఇంటర్మీడియట్‌తో పాటు కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి. జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ఫార్మసీ డిప్లొమాతో పాటు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వీటితో పాటు టెక్నీషియన్, ల్యాబ్ టెక్నాలజిస్ట్, స్టెనోగ్రాఫర్, స్టోర్ కీపర్, అకౌంట్స్ వంటి మరెన్నో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, వీటికి 400 మార్కులు కేటాయించారు. అంటే ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి, అదేవిధంగా ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు నెగెటివ్ మార్కింగ్ (కోత) ఉంటుంది. ఈ పరీక్ష రాయడానికి 90 నిమిషాల సమయం ఇస్తారు. కొన్ని నిర్దిష్ట పోస్టులకు ఈ రాత పరీక్షతో పాటు అదనంగా స్కిల్ టెస్ట్ (నైపుణ్య పరీక్ష) కూడా నిర్వహిస్తారు. ఈ ప్రక్రియల అనంతరం అభ్యర్థులకు ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికను పూర్తి చేస్తారు. ఇందులో ఉద్యోగం సాధించిన వారికి పోస్టుల కేటగిరీని బట్టి లెవెల్-2 నుంచి లెవెల్-7 పే స్కేల్ ప్రకారం ఆకర్షణీయమైన జీతభత్యాలు అందుతాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులు రూ.3,000 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,400 ఫీజుగా నిర్ణయించారు. కాగా, దివ్యాంగ (PH) అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు జులై 3, 2026 లోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 25, 26, 27 తేదీలలో సీబీటీ (CBT) పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, సిలబస్ , దరఖాస్తు లింక్ కోసం అభ్యర్థులు ఎయిమ్స్ (AIIMS) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.









