
Mumbai Massive Conspiracy : ముంబై మహానగరంలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని వందలాది మంది అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకునేందుకు పన్నాగం పన్నిన ఒక భారీ నరమేధ కుట్రను ముంబై పోలీసులు అత్యంత సమయస్ఫూర్తితో భగ్నం చేశారు. ఊరేగింపులో పాల్గొనే ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఏకంగా 14,900 ఎలుకల విషపు గుళికలను (క్యాప్సూల్స్) పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణేలోని విమాన్ నగర్ ప్రాంతానికి చెందిన ఫయాజ్ ప్రేమ్‌జీ అనే పెయింట్ (రంగుల) వ్యాపారి ఈ ఘోర కుట్రకు ప్లాన్ చేశాడు. షియా ఖోజా ముస్లిం వర్గానికి చెందిన ఫయాజ్ భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. కొద్దిరోజులుగా ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో ఉన్న ఒక గెస్ట్ హౌస్, డార్మిటరీలో ఉంటూ.. జెజె, బైకుల్లా ప్రాంతాల మీదుగా సాగే మొహర్రం ఊరేగింపును టార్గెట్‌గా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
Also Read : ‘వివాహం రద్దు చేసుకోవడం కంటే చంపడమే సులభం అనుకున్నా’.. సియా షాకింగ్ నిజాలు!
ఇందుకోసం నిందితుడు ఏకంగా 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్ (ఎలుకల మందు) ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. తన గదిలోనే కూర్చుని ప్రతి క్యాప్సూల్‌లో ఒక గ్రాము చొప్పున విషాన్ని నింపుతూ మొత్తం 30,000 విషపు గుళికలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే, జూన్ 26 శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఊరేగింపులో పాల్గొన్న ఒక వ్యక్తి ఈ గుళికల వల్ల వాంతులు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన పోలీస్ బృందం, అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న ఫయాజ్‌ను తక్షణమే అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న 14,900 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకుంది.
ఈ కేసులో షాకింగ్ అంతర్జాతీయ కోణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు 2019 నుండి 2025 మధ్య కాలంలో ఇరాన్, ఇరాక్ దేశాలకు పలుమార్లు ప్రయాణించాడని, గడిచిన ఏడాది కాలంలోనే ఏకంగా 19 సార్లు ఆ దేశాలకు వెళ్లినట్లు విచారణలో తేలింది. నిందితుడి సోదరి ఇరాన్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తుండగా, అతని తల్లి కూడా ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. ఈ పర్యటనల వెనుక ఏదైనా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందా, లేదా ఎవరి ప్రోద్బలంతోనైనా అతను ఈ పని చేశాడా అనే కోణంలో పోలీసులు అతని మొబైల్ ఫోన్, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం నిందితుడిపై బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్లు 109, 110, 123 కింద హత్యాయత్నం, విషప్రయోగం వంటి రకాల కేసులు నమోదు చేశారు. ముంబైలో భారీ ఎత్తున ప్రాణనష్టం కలిగించేందుకు జరిగిన ఈ కుట్రను పోలీసులు సకాలంలో అడ్డుకుని పెను ముప్పును నివారించారని డీసీపీ జయంత్ మీనా వెల్లడించారు. ఈ ఘటనతో ముంబై పోలీసులు మహానగరవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పండుగలు, ఊరేగింపుల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే ఎలాంటి పదార్థాలనైనా తినవద్దని ప్రజలకు సూచించారు.
Also Read : మీరు నిజంగా భారతీయులని ఏది నిరూపిస్తుంది?









