Vedma Bhojju : తెలంగాణ అధికార పక్షమైన కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత అసంతృప్తి ఒక్కసారిగా బట్టబయలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తన సొంత ప్రభుత్వం, మంత్రులు,అధికారుల వైఖరిపై తీవ్రస్థాయిలో తిరుగుబావుటా ఎగురవేశారు. అధికార పార్టీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ తన మాటను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ, నియోజకవర్గంలో ప్రోటోకాల్ దక్కడం లేదంటూ ఆయన బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. సుదీర్ఘకాలం కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు, నాయకులకు తాము కనీస న్యాయం చేయలేకపోతున్నామని మంత్రి ముందే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీల నేతలకు ప్రాధాన్యత ఇస్తూ పోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆయన గట్టిగా హెచ్చరించారు.
అధికార యంత్రాంగం కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పినట్లే ఎక్కువగా వింటున్నారని బొజ్జు మండిపడ్డారు. ఏజెన్సీ ఉద్యోగాల నియామకాల విషయంలో ఆదిలాబాదులో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అలాగే నిర్మల్ జిల్లాలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పినట్లుగానే అంతా నడుస్తోందని ఆయన ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రతినిధులను పక్కనబెట్టి, ప్రత్యర్థి పార్టీల నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇతర పార్టీల నాయకులు నేరుగా హైదరాబాద్ వెళ్లి కాంగ్రెస్ మంత్రుల దగ్గర కూర్చుని తమకు కావాల్సిన పనులకు సంబంధించిన లెటర్లు తెచ్చుకుంటున్నారని వెడ్మ బొజ్జు సంచలన ఆరోపణ చేశారు. ఇక్కడి స్థానిక అధికారులు కూడా మంత్రుల ఆదేశాలంటూ విపక్ష నేతల పనులను చకచకా చేసి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా నా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి” అంటూ అధికారుల తీరును ఆయన తూర్పారబట్టారు. ఒక అధికార పక్ష ఎమ్మెల్యేనే తన సొంత మంత్రులు, అధికారుల ప్రోటోకాల్‌ను తప్పుబడుతూ ఈ స్థాయి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.