Pakistan Airstrikes : పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు మరోసారి యుద్ధ విమానాల మోతతో దద్దరిల్లాయి. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌ వ్యాప్తంగా భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్ర దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటన్నింటికీ అఫ్గాన్ కేంద్రంగా పనిచేస్తున్న తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP),దాని అనుబంధ సంస్థలే కారణమని ఇస్లామాబాద్ గట్టిగా నమ్ముతోంది. ఈ క్రమంలోనే సరిహద్దులు దాటి మరీ ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టేందుకు పాక్ సైన్యం వ్యూహాత్మక ఆపరేషన్‌కు తెరలేపింది.

గత శనివారం కరాచీలోని పారామిలిటరీ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లో ముగ్గురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు దుండగులు హతమయ్యారు. ప్రాణాలతో పట్టుబడిన మరో నిందితుడు అఫ్గాన్ జాతీయుడిగా తేలడం, ఈ దాడికి తామే బాధ్యులమని టీటీపీ అనుబంధ సంస్థ ‘జమాత్-ఉల్-అహ్రార్’ ప్రకటించడంతో పాక్ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా స్పందించింది.

కరాచీ దాడి జరిగిన మరుసటి రోజే పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ (PAF) రంగంలోకి దిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల సమయంలో అఫ్గానిస్థాన్‌లోని పక్తియా, పక్తికా, కునార్ ప్రావిన్సుల్లోని ఉగ్రవాద రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా గ్రౌండ్ యాక్షన్, ఎయిర్ స్ట్రైక్స్ రెండింటినీ ఏకకాలంలో ఉపయోగించి ఉగ్రవాదుల కోటలను పాక్ దళాలు ధ్వంసం చేశాయి.

Also Read : ఖమేనీ అంత్యక్రియలు, మొజ్తాబా కనిపించేనా? ప్రపంచ దేశాల చూపు ఇరాన్ వైపు!

అయితే ఈ దాడుల్లో పాకిస్థాన్ అనుసరించిన ‘డబుల్ టాప్’ వ్యూహం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. మొదటి విడత బాంబు దాడి జరిగిన 25 నిమిషాల వ్యవధిలోనే పాక్ విమానాలు రెండోసారి దాడులకు దిగాయి. తొలి దాడిలో గాయపడిన వారిని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్థానిక సహాయక బృందాలు, గ్రామస్థులు గుమిగూడిన సమయంలో ఈ రెండో దాడి జరగడం వల్ల ప్రాణనష్టం భారీగా పెరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ భీకర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై ఇరు దేశాల నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తున్నాయి. అత్యంత కచ్చితత్వంతో తాము జరిపిన దాడుల్లో 35 మంది (మరో ప్రకటనలో 29 మంది) భయంకర టీటీపీ మిలిటెంట్లను మట్టుబెట్టామని పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ సామాజిక మాధ్యమం ‘X’ వేదికగా ధృవీకరించారు. అయితే, మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, అమాయక చిన్నారులు , సామాన్య పౌరులే ఉన్నారని అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

పాకిస్థాన్ జరిపిన ఈ వైమానిక దాడులను అఫ్గానిస్థాన్ తీవ్రంగా ఖండించింది. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ పాక్ జరిపిన ఈ దాడులు పిరికిపంద చర్య అని అభివర్ణించారు. సామాన్య పౌరుల మరణాలకు కారణమవుతూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాక్ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

మరోవైపు, అంతర్జాతీయ వేదికలపై అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల పునరుద్ధరణకు తామే కారణమంటూ గొప్పలు చెప్పుకునే పాకిస్థాన్, పొరుగు దేశాలతో మాత్రం నిరంతరం కయ్యానికి కాలుదువ్వుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత దేశంలో భద్రతను కాపాడుకోవడంలో విఫలమవుతూ, సరిహద్దు దేశాల జనావాసాలపై దాడులు చేయడం ద్వారా ఇస్లామాబాద్ తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బలూచిస్థాన్ విముక్తి పోరాటాలు,సరిహద్దు వివాదాల కారణంగా ఇస్లామాబాద్-కాబూల్ మధ్య గత కొంతకాలంగా ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోంది. తాజా వైమానిక దాడులు, దానికి ప్రతిగా అఫ్గాన్ దళాలు జరుపుతున్న ఎదురుదాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సరిహద్దు ఘర్షణలు మున్ముందు దక్షిణాసియా ప్రాంతంలో మరింత అశాంతికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read : వెనిజులాలో భూకంపం: తన ప్రాణాలను అడ్డుపెట్టి బిడ్డను కాపాడిన ఫుట్‌బాలర్ భార్య!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.