
నేటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. గ్యాస్ ధరలు తగ్గడంతో పాటు ఉచిత ఆధార్ అప్డేట్స్, కార్ల ధరలు పెరగడం వంటివి కూడా ఉన్నాయి. అయితే నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఆ 5 రూల్స్ ఏంటో చూద్దాం.
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరల తగ్గింపు
చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా తగ్గించాయి. సిలిండర్‌పై ఏకంగా రూ.183.50 మేర కోత విధించాయి. దీంతో ఢిల్లీలో రూ.3,113.50 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.2,930కి చేరింది. అలాగే విమాన ఇంధనం ధరను కూడా కిలో లీటరుకు రూ.1.15 లక్షల నుంచి రూ.1.10 లక్షలకు తగ్గించారు. అయితే ఇళ్లలో వాడే 14 కిలోల గృహ వంటగ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుదల
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఇంధన రిటైలర్ ‘నయారా ఎనర్జీ’ తన 7,000కు పైగా పెట్రోల్ బంకుల్లో ఇంధన ధరలను తగ్గించింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.3 మేర తగ్గింపును ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు సడలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉచిత ఆధార్ ఈమెయిల్ అప్డేట్
ఆధార్ కార్డు వినియోగదారుల కోసం UIDAI గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 1 నుంచి మీ ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడీని మార్చుకోవాలనుకుంటే.. ఆధార్ యాప్ ద్వారా పూర్తి ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ సేవ కోసం రూ.75 ఛార్జ్ చేసేవారు. అయితే నిర్దేశిత గడువు లోపు చేసుకునే వారికి మాత్రమే ఈ ఉచిత సదుపాయం వర్తిస్తుంది.
కొత్త కార్లు
కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచేశాయి. కియా మోటార్స్ తన కార్ల ధరలపై 2% మేర భారాన్ని పెంచగా, టాటా మోటార్స్ సైతం తమ నార్మల్ (ICE), ఎలక్ట్రిక్ (EV) మోడళ్ల ధరలను 1.5% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీలో కొత్త ఈవీ పాలసీ & క్రెడిట్ కార్డ్ రూల్స్
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఈవీ విధానాన్ని తెచ్చింది. దీనికోసం రాబోయే నాలుగేళ్లలో రూ.15,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటితో పాటు పాస్‌పోర్ట్ సేవా రుసుములు పెరగనున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ హోల్డర్లు గత క్యాలెండర్ త్రైమాసికంలో కనీసం రూ.60,000 ఖర్చు చేస్తేనే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. ఎస్బీఐ కూడా కొన్ని కార్డుల రివార్డ్ పాయింట్లను సవరించింది.








