State Anthem
State Anthem

Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠ భరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. దశాబ్దాల పాటు సాగిన డీఎంకే, అన్నాడీఎంకే కూటముల ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా 108 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కళగం (TVK) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన ఒక భారీ కుట్రను రాష్ట్ర ఇంటెలిజెన్స్ (నిఘా) విభాగం విజయవంతంగా భగ్నం చేసింది. ఒకేసారి 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, ప్రభుత్వం మెజారిటీని కోల్పోయేలా చేసేందుకు విపక్షాలు పన్నిన వ్యూహం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

రూ. 35 కోట్ల భారీ ఆఫర్.. ఎమ్మెల్యే ఫిర్యాదుతో బయటపడ్డ రహస్యం

టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా చెన్నై పోలీసులకు ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో ఈ నల్లధన రాజకీయం వెలుగులోకి వచ్చింది. ‘ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్’ (IPDS) అనే ఒపీనియన్ పోల్/కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధిగా చెప్పుకుంటూ తిరునావుక్కరసు అనే వ్యక్తి తనను సంప్రదించాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని, ఇందుకు ప్రతిఫలంగా రూ. 35 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేశాడని ఇళయరాజా వెల్లడించారు. ఈ ప్రలోభాన్ని తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించినప్పటికీ, తమ మధ్య జరిగిన సంభాషణలను బయటపెడతానంటూ తిరునావుక్కరసు తనను బెదిరింపులకు గురిచేశాడని, దీంతో తాను పోలీసులను ఆశ్రయించక తప్పలేదని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో స్పష్టం చేశారు.

Also Read : రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ: మీ ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఇలా చేయండి

రంగంలోకి ఇంటెలిజెన్స్.. ముగ్గురు నిందితుల అరెస్ట్

ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న చెన్నై పోలీసులు, రాష్ట్ర నిఘా విభాగం (స్టేట్ ఇంటెలిజెన్స్) సంయుక్తంగా రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు జరిపిన అధికారులు, ఈ కుట్ర వెనుక ఉన్న కీలక సూత్రధారులను గుర్తించారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తిరునావుక్కరసుతో పాటు.. ప్రధాన నిందితుడి సోదరుడు వి. అశోక్ కుమార్ సహా మొత్తం ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కుట్ర వెనుక డీఎంకే హస్తం? సెంథిల్ బాలాజీ వైపు వేళ్లు!

ఈ ఆపరేషన్ వెనుక ప్రతిపక్ష డీఎంకే (DMK) అగ్రనాయకత్వం హస్తం ఉందనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా డీఎంకే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ సూచనలు, పర్యవేక్షణలోనే ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వం నడిచినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్ నేరుగా ఈ వ్యవహారంలో అరెస్ట్ కావడంతో డీఎంకే పార్టీ తీవ్ర డిఫెన్స్‌లో పడింది. ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలను లొంగతీసుకుని విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలనే సెంథిల్ బాలాజీ ప్లాన్‌ను నిఘా వర్గాలు ముందే పసిగట్టడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.

Also Read : కెవ్వ్ కేక: ఆఫర్లే ఆఫర్లు.. మైండ్‌ బ్లోయింగ్ డిస్కౌంట్స్.. అస్సలు వదలొద్దు!

ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం.. కఠిన చర్యలకు డిమాండ్

ఈ రాజకీయ కుట్రపై తమిళనాడు మంత్రి సీటీ నిర్మల్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాల నీచ రాజకీయాలకు ఈ ఘటనే సజీవ సాక్ష్యమని ఆయన ధ్వజమెత్తారు. “మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులే ఇందులో నేరుగా భాగస్వాములయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చాలని చూసే ఇటువంటి దుర్మార్గపు చర్యలను సహించేది లేదు. ఈ కుట్రలో భాగస్వాములైన చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.