ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు ఉధృతంగా సాగుతోంది. అక్కడి ప్రజలు తమకు స్వేచ్ఛ కావాలంటూ రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. అయితే, ఈ తిరుగుబాటు స్వరాలను నొక్కేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఏ పంథానైతే ఎంచుకుందో, సరిగ్గా 78 ఏళ్ల క్రితం (1947లో) మహమ్మద్ అలీ జిన్నా కూడా అఖండ కాశ్మీర్‌ను దక్కించుకోవడానికి ఇదే కుట్రను అమలు చేశారు. PoK ప్రజలను లొంగదీసుకోవడానికి పాకిస్తాన్ ప్రస్తుతం అక్కడికి వెళ్లే ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. ఆకలితో, ఇంధన కొరతతో అలమటించి ప్రజలు తమ ముందు మోకరిల్లేలా చేయడమే పాక్ వ్యూహం. అయితే, ఇదే పిరికిపంద చర్యను 1947లో జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్‌ను లొంగదీసుకోవడానికి, ఆయన సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు జిన్నా ప్రయోగించారనే విషయం నేటి తరంలో చాలా మందికి తెలియదు.

పాకిస్తాన్ గుప్పిట్లోనే కాశ్మీర్ రవాణా మార్గాలు
భారతదేశ భౌగోళిక పటాన్ని (మ్యాప్) చూసే సామాన్య ప్రజలకు జమ్మూ కాశ్మీర్ భారత్‌కు సరిగ్గా పైభాగంలోనే ఉంది కదా అనిపిస్తుంది. కానీ 1947 ఆగస్టు 15 నాటికి మహారాజ హరిసింగ్ తాను భారత్‌లో కలవాలా, పాకిస్తాన్‌లో కలవాలా లేదా స్వతంత్రంగా ఉండాలా అనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దానికి ప్రధాన కారణం, ఆ సమయంలో కాశ్మీర్‌కు చేరుకోవడానికి ఉన్న ప్రధాన రవాణా మార్గాలన్నీ పాకిస్తాన్‌గా మారబోతున్న ప్రాంతం గుండానే ఉండేవి. విభజన సమయంలో పంజాబ్ నుండి భారతదేశానికి దక్కిన భాగం ద్వారా కాశ్మీర్‌కు వెళ్లడానికి ఎలాంటి సరైన పక్కా రహదారి లేదు. కాశ్మీర్ లోయకు వెళ్లే ఏకైక ప్రధాన రహదారి ‘జీలం వ్యాలీ రోడ్’ (శ్రీనగర్ – రావల్పిండి హైవే). ట్రక్కులు, బస్సులు, లారీలు అన్నీ ఈ మార్గం గుండానే వెళ్లేవి. అంతేకాదు, అప్పట్లో కాశ్మీర్‌కు నేరుగా రైలు మార్గం కూడా లేదు. మన వైపు నుంచి రైల్వే లైన్ చివరి స్టేషన్ పఠాన్‌కోట్ కాగా, జమ్మూకు ఉన్న ఏకైక రైల్వే లైన్ ‘జమ్మూ – సియాల్‌కోట్’ మార్గం. దేశ విభజనతో అటు రావల్పిండి హైవే, ఇటు సియాల్‌కోట్ రైల్వే లైన్ రెండూ పాకిస్తాన్ పరిధిలోకి వెళ్లిపోయాయి.

Also Read : కేరళలో కలకలం: ఫేక్ ఐడీలతో దొరికిపోయిన ముగ్గురు బంగ్లాదేశీయులు!

స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్ (యథాతథ స్థితి ఒప్పందం) ఎందుకు జరిగింది?
భారతదేశంతో అనుసంధానం కావడానికి కూడా పాకిస్తాన్ భూభాగంపైనే ఆధారపడాల్సిన భౌగోళిక పరిస్థితి కారణంగా, మహారాజ హరిసింగ్ తొలుత పాకిస్తాన్‌తో ‘స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్’ (యథాతథ స్థితి ఒప్పందం) చేసుకున్నారు. కాశ్మీర్ భవిష్యత్తుపై తుది నిర్ణయం జరిగే వరకు, బ్రిటిష్ కాలంలో సాగినట్లే కాశ్మీర్‌కు సరుకుల రవాణా, వాణిజ్య సదుపాయాలు యథావిధిగా కొనసాగాలనేది ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. భౌగోళికంగా గుర్దాస్‌పూర్, బటాలా, పఠాన్‌కోట్ తహసీల్స్ భారతదేశానికి దక్కినప్పటికీ, అక్కడి నుండి జమ్మూకు వెళ్లడానికి కొండలు, నదులు అడ్డంగా ఉండటం వల్ల రహదారులు లేవు. శీతాకాలంలో, వర్షాకాలంలో ఈ మార్గాల ద్వారా కనీస సంబంధాలు కూడా తెగిపోయేవి. ఒకవేళ పఠాన్‌కోట్ నుండి జమ్మూ చేరుకున్నా, జమ్మూ నుండి కాశ్మీర్ లోయకు వెళ్లడానికి మధ్యలో ‘పీర్ పంజాల్’ పర్వత శ్రేణులు అధిగమించలేని అడ్డంకిగా ఉండేవి. జిన్నా ,పాకిస్తాన్ పాలకులు సరిగ్గా ఈ శీతాకాలం కోసమే వేచి చూశారు.

మొదట పెట్రోల్ బంద్… ఆపై ఉప్పు, రేషన్ నిలిపివేత
ఒప్పందం ప్రకారం మొదట్లో శ్రీనగర్ నుండి రావల్పిండి వరకు జీలం వ్యాలీ రోడ్డుపై ట్రక్కులు నడిచాయి. కాశ్మీర్‌కు అవసరమైన పెట్రోల్, ఉప్పు, గోధుమపిండి, బట్టలు వంటి అత్యవసర వస్తువులన్నీ ఈ రహదారి గుండానే వచ్చేవి. కానీ, ఆగస్టు దాటి సెప్టెంబర్ రాగానే పాకిస్తాన్ తన బుద్ధిని బయటపెట్టుకుంది. కొత్త దేశం ఏర్పడుతోందని, కాగితపు ప్రక్రియలు ఉన్నాయంటూ నెపాలు చెబుతూ ట్రక్కులను నిలిపివేయడం ప్రారంభించింది. పంజాబ్‌లో అల్లర్లు జరుగుతున్నాయని, సరుకులు లూటీ అవుతున్నాయని అబద్ధాలు చెప్పింది. క్రమంగా కాశ్మీర్‌కు ఊపిరాడకుండా చేస్తూ మొదట పెట్రోల్‌ను, ఆ తర్వాత ఉప్పును, ఆపై గోధుమపిండి సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. శీతాకాలం ముంచుకొస్తున్న వేళ ఇంధనం, ఆహారం లేకపోతే ప్రజలతో పాటు సైన్యం కూడా చేతులెత్తేస్తుందని పాక్ భావించింది. అప్పట్లో భారత్ నుండి విమానాల ద్వారా సరుకులు పంపడం కూడా అంత సులువు కాదు, ఎందుకంటే అప్పట్లో వాయు రవాణా వసతులు అంతగా లేవు. ఈ విధంగా మహారాజును లొంగదీసుకోవడానికి పాక్ అన్ని దారులనూ మూసేసింది.

Also Read : వాట్సాప్‌లో సూపర్ ప్రైవసీ ఫీచర్.. ఫోన్ నంబర్ లేకుండానే చాట్ చేసుకునే చాన్స్!

పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ.. విఫలమైన వ్యూహం
ఆహార కొరత, పెట్రోల్ కొరతతో కాశ్మీర్ గోదాములు ఖాళీ అవుతున్న తరుణంలో, అక్టోబర్ 22 రాత్రి పాకిస్తాన్ సైనికులు ‘గిరిజన తెగల (కబైలీలు)’ వేషధారణలో ఆయుధాలతో ముజఫరాబాద్ రోడ్డు ద్వారా కాశ్మీర్‌లోకి చొరబడ్డారు. ఇది మహారాజుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు చేస్తున్న తిరుగుబాటుగా ప్రపంచానికి చూపేందుకు పాక్ ప్రయత్నించింది (ప్రతి యుద్ధంలోనూ తన సైన్యాన్ని కాదని అబద్ధం చెప్పడం పాకిస్తాన్‌కు మొదటి నుంచీ అలవాటే). ఆ చొరబాటుదారులు దారిపొడవునా లూటీలు చేస్తూ, ఇళ్లను తగులబెడుతూ, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూ శ్రీనగర్ వైపు దూసుకువచ్చారు. అప్పుడు మహారాజ హరిసింగ్ లార్డ్ మౌంట్‌బాటన్‌కు లేఖ రాస్తూ, పాకిస్తాన్ తమ సరుకుల సరఫరాను నిలిపివేసి కాశ్మీర్ గొంతు నొక్కిందని, ఇప్పుడు కిరాయి మూకలను పంపి సర్వనాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, పాకిస్తాన్ వేసిన ఈ వ్యూహం దానికి ఉల్టా అయ్యింది. ప్రాణసంకట స్థితిలో ఉన్న మహారాజ హరిసింగ్ కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేస్తూ ఒప్పందంపై సంతకం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన భారత సైన్యం విమానాల ద్వారా శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, బారాముల్లా వరకు వచ్చేసిన పాక్ చొరబాటుదారులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ తర్వాత ఏర్పడిందే ‘లైన్ ఆఫ్ కంట్రోల్’ (LoC).

నాడు అఖండ కాశ్మీర్‌ను దక్కించుకోవడానికి ఆహారం, పెట్రోల్ ఆపేసి బ్లాక్‌మెయిల్ చేసిన పాకిస్తాన్… నేడు తాను అక్రమంగా ఆక్రమించుకుని ‘ఆజాద్ కాశ్మీర్’ అని పిలుచుకుంటున్న PoK ప్రాంత ప్రజలను అణచడానికి కూడా అదే దుర్మార్గాన్ని ప్రయోగిస్తోంది. తాము ‘ఆజాద్ (స్వతంత్ర)’ అని చెప్పుకునే ప్రాంతంలోనే ప్రజలను ఆకలితో అలమటించేలా చేస్తూ, పాకిస్తాన్ ఎంతటి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందో ప్రపంచమంతా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.