
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ముదిరింది. ఉక్రెయిన్ ఇటీవల రష్యా ఆయిల్ ఫ్యాక్టరీలపై దాడులు చేయడంతో అక్కడ ఇంధన కొరత ఏర్పడింది. దీనికి ప్రతీకారంగా రష్యా అర్ధరాత్రి వేళ ఉక్రెయిన్పై విరుచుకుపడింది. రాజధాని కీవ్ నగరమే లక్ష్యంగా కొన్ని గంటల పాటు డ్రోన్లు, బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులతో దాడుల వర్షం కురిపించింది. రష్యా సైన్యం ఉక్రెయిన్ భూభాగంపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడింది. కొన్ని గంటల పాటు నిరంతరాయంగా రష్యా ఉక్రెయిన్పై దాడులు చేసింది. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ ఇటీవల రష్యాకు చెందిన కీలకమైన చమురుశుద్ధి కార్మాగారాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
ఉక్రెయిన్ చేసిన ఆ దాడుల వల్ల రష్యా అంతటా ఇంధన కొరత ఏర్పడి, ఆ దేశ ఆర్థిక, రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి పెరిగింది. దీనికి తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలని రష్యా ప్రభుత్వం ఈ దాడులు చేపట్టింది. ఉక్రెయిన్ను కోలుకోలేని దెబ్బ తీయాలని అర్థరాత్రి సమయంలో ఈ దాడులకు పాల్పడింది. అర్ధరాత్రి వేళ ఉక్రెయిన్ ఆకాశంలోకి రష్యా సైన్యం వందలాది డ్రోన్లు, శక్తివంతమైన క్షిపణులను ఏకకాలంలో ప్రయోగించింది. ఈ దాడిలో రష్యా అత్యంత ప్రమాదకరమైన బాలిస్టిక్ క్షిపణులతో పాటు, అధునాతన క్రూజ్ క్షిపణులను కూడా భారీగా ఉపయోగించింది. రాజధాని కీవ్ నగరంలో వరుసగా సంభవించిన భయంకరమైన పేలుళ్ల శబ్దాలకు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై వణికిపోయారు.
రష్యా క్షిపణుల తాకిడికి ఉక్రెయిన్ రక్షణ వలయాలు దాటుకుని అనేక నివాస భవనాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా నిప్రో నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న నివాస ప్రాంతాలు, కీలక మౌలిక వసతులపై ఈ దాడుల ప్రభావం తీవ్రంగా పడింది. అక్కడ భారీగా ఆస్తి నష్టం సంభవించడంతో పాటు అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా దాడుల తీవ్రతను ముందుగానే గమనించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రజలను తక్షణమే అప్రమత్తం చేశారు. శత్రువుల దాడుల నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది ప్రజలు స్థానిక మెట్రో స్టేషన్ల భూగర్భ ప్రాంతాల్లోకి చేరి ఆశ్రయం పొందారు. రష్యా చేసిన ఈ దారుణమైన దాడిని ఉక్రెయిన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన భయంకరమైన శత్రుదాడి అని ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది.









