
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జలమార్గమైన పనామా కాలువ నియంత్రణను పనామా దేశానికి అప్పగించడం అమెరికా చరిత్రలోనే అత్యంత మూర్ఖపు తప్పిదమని అన్నారు. ఇటీవల నార్త్ డకోటాలో జరిగిన ‘థియోడర్ రూజ్‌వెల్ట్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. అక్కడ గత పాలకులు తీసుకున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కీలక జలమార్గాన్ని చైనా తన గుప్పిట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని, కానీ దానికి తాము అనుమతించమన్నారు.
Also Read : కూలిపోనున్న పాక్ ప్రభుత్వం.. ఎదురుతిరిగిన వేల మంది ప్రజలు
ట్రంప్ ఈ కార్యక్రమంలో పనామా కాలువ చారిత్రక నేపథ్యాన్ని, ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావించారు. 1977లో జరిగిన టోరిజోస్-కార్టర్ ఒప్పందాల ప్రకారం అమెరికా ఈ కాలువ నియంత్రణను పనామాకు బదిలీ చేసింది. ఆ తర్వాత 1999లో పనామా దేశం ఈ జలమార్గంపై పూర్తి బాధ్యతలను తీసుకుంది. మనం పనామా కాలువను ఉచితంగా అవతలి వాళ్లకు ఇచ్చేశామని అన్నారు. ఇలా పనామా కాలువను వారికి ఇవ్వడం వల్ల.. ఆ దేశం ఆ మార్గం గుండా వెళ్లే ఓడల రవాణా ధరలను ఒక్కసారిగా నాలుగు రెట్లు పెంచేసింది. అయినప్పటికీ ఒక్క ఓడ కూడా ఆ మార్గాన్ని వదులుకోలేదు. ఆ తర్వాత మళ్లీ రెండు సార్లు ధరలు పెంచారు. ఇలా ధరలు పెంచుకుంటూ వారు ఏళ్ల తరబడి నుంచి భారీగా డబ్బు సంపాదించారు. ఇంతకంటే మూర్ఖపు నిర్ణయం మరొకటి ఉంటుందా అని అన్నారు. దీన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆ ప్రాంతంలో చైనా జోక్యం పెరగడంపై ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చైనా ఈ పనామా కాలువపై పూర్తి పట్టు సాధించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన ఈ మార్గం చైనా చేతుల్లోకి వెళ్తే అమెరికా భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగించే ఈ పరిణామాన్ని తాము ఊరికే చూస్తూ ఊరుకోబోమని, చైనా ప్రయత్నాలను ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు.
అలాగే ట్రంప్ పుట్టుకతో వచ్చే పౌరసత్వం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా స్పందించారు. ఇతర దేశాల నుంచి వచ్చే ధనవంతుల పిల్లల కోసం పౌరసత్వ చట్టాన్ని ఉద్దేశించలేదని, సివిల్ వార్ ముగిసిన తర్వాత బానిసల పిల్లల కోసం దాన్ని తెచ్చారన్నారు. చైనా నుంచి వచ్చే ధనవంతులు ఇక్కడి పౌరసత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఈ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే అధ్యక్షుడి అధికారాలను పెంచుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును స్వాగతించారు.
Also Read : పాక్‌ను పరిగెత్తించిన ఆఫ్గానిస్తాన్.. అచ్చం భారత్‌లానే!









